The Mind Behind the Machine - 15 in Telugu Love Stories by swathi books and stories PDF | యంత్రం వెనుక మనసు - 15

The Author
Featured Books
Categories
Share

యంత్రం వెనుక మనసు - 15


అయాన్ అలా తన వైపే తదేకంగా చూస్తుండిపోయేసరికి నీల గుండె వేగం మరింత ఎక్కువైంది. ఒక యంత్రానికి మానవ భావోద్వేగాలు తెలియవని ఆమెకు తెలుసు, కానీ అతని కళ్లలో కనిపిస్తున్న ఆ నిశ్శబ్దం, ఆ కొత్త చూపు ఆమెకు ఏదో తెలియని సిగ్గును, హాయిని ఇస్తున్నాయి.

అదే సమయంలో, అక్కడే భోజనం తింటున్న ఒక వృద్ధ తాత నీల దగ్గరకు వచ్చి, కళ్లల్లో నీళ్ల, ఈ రోజు నీ పేరు చెప్పుకుని మేము కడుపునిండా తింటున్నవమ్మ.

దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని చాలా చల్లగా చూడాలి తల్లి! తల్లి ఇలా అంటున్నాను అని అనుకోపోతే మా మీద దయ ఉంచి ఇలాగే మీ ఇంట్లో ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా, అన్నం మిగిలిపోతే మమ్మల్ని గుర్తుతెచ్చుకోండమ్మ" అంటూ ఏడవడం మొదలుపెట్టాడు.

ఆ తాత ఆకలి గోడును, కన్నీళ్లను చూడగానే నీల మనసు ద్రవించిపోయింది. ఆమె వెంటనే ఆ వృద్ధుడి చేతులు పట్టుకుని, "తాతా, నువ్వు అస్సలు బాధపడకు. మీ అందరికీ రోజు కడుపునిండా భోజనం అందేలా నేను ఎలాగైనా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను" అని కొండంత నమ్మకాన్ని ఇచ్చింది.

అంతలోనే పక్కనే ఉన్న ఇంకొక మామ ముందుకు వచ్చి, భావోద్వేగంతో.. "అమ్మ! నువ్వు నిజంగా అలా చేస్తే, చచ్చి నీ కడుపున పుడతాను తల్లి!" అంటూ నీల కాళ్ల మీద పడబోయాడు.నీల కంగారుపడుతూ వృద్ధురాలిని
 వారించి, "తప్పు మామ, మీరు అలా చేయకండి.

నేను మీకంటే చాలా చిన్నదానిని. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ అందరి ఆకలి తీర్చేలా నేను ఖచ్చితంగా ఒక మార్గం ఆలోచిస్తాను, సరేనమ్మ?" అంది ఎంతో వినయంగా.ఆ తర్వాత చుట్టూ ఉన్న చీకటిని, వాతావరణాన్ని గమనించి, "సమయం రాత్రి 12.00 అవుతుంది వెళ్ళండమ్మ.

ఇంకా చాలా చీకటిగా ఉంది, అసలే బురద నీరు ఎక్కువగా వచ్చేస్తుంది, ఇక్కడ లైట్లు కూడా లేవమ్మ. కొంచెం జాగ్రత్తగా వెళ్లి రండమ్మ" అని చెప్పి, ఆ పేద ప్రజలు కొంత దూరం వరకు అయాన్ ,నీల, సాగనంపారూ.

నీల ,అయాన్ కారు వైపు నడవసాగారూ. చుట్టూ గాఢమైన చీకటి. దారంతా బురద నీటితో నిండిపోయి ఉంది. లైట్లు కూడా ఎక్కడా కనిపించకపోవడంతో, ఆమె తన సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేసి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

ఆమె వెనకే అయాన్ నిశ్శబ్దంగా నడుస్తున్నాడు.

ఒక్కసారిగా—

నీల కాలు బురదలో జారి ముందుకు తూలింది.

“అమ్మా!”

ఆమె కిందపడేలోపే అయాన్ మెరుపు వేగంతో స్పందించాడు. తన బలమైన చేతిని ఆమె నడుము చుట్టూ వేసి, ఒక్కసారిగా తన వైపుకు లాక్కున్నాడు.

తర్వాతి క్షణం...

నీల నేరుగా అయాన్ గుండెలపై వాలిపోయింది.

ఆ చీకటి రాత్రిలో, సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్ వెలుతురు వాళ్లిద్దరి ముఖాలపై మాత్రమే పడుతోంది.

కొన్ని క్షణాలు...

ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు.

అయాన్ చూపు నీల కళ్లను వదలలేదు.

నీల గుండె మాత్రం తనకు తానే వినిపించేంత వేగంగా కొట్టుకుంటోంది.

“నీలా...”

అయాన్ గొంతులో ఆ రోజు వరకు లేని ఒక మృదుత్వం.

నీల అతని వైపు చూసింది.

“నువ్వు బాగానే ఉన్నావా?”

ఆమె మాట్లాడలేక కేవలం తల ఊపింది.

ఎందుకో... అయాన్ చేతులు ఇంకా తన నడుముపైనే ఉన్నాయన్న ఆలోచనే ఆమెకు తెలియని సిగ్గును కలిగిస్తోంది.

అయాన్ నెమ్మదిగా తన చేతులను వెనక్కి తీసుకున్నాడు.

“సరే... నడువు.”

అతని చేయి దూరమైన వెంటనే నీల మనసులో ఏదో ఖాళీ ఏర్పడినట్టనిపించింది.

ఇంకొంచెం సేపు అలాగే ఉంటే బాగుండేదేమో...

ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది.

మైకంలో ముందుకు అడుగు వేయబోయింది.

కానీ—

“అమ్మా!”

ఒక్కసారిగా నొప్పితో నీల కేక వేసింది.

అయాన్ ఒక్క క్షణంలోనే ఆమె దగ్గరకు వచ్చాడు.

“నీలా... ఏమైంది?”

ఈసారి అతని స్వరంలో ఆందోళన స్పష్టంగా వినిపించింది.

“నా కాలు... బెణికింది అయాన్. నడవలేకపోతున్నాను...”

నీల కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఆమె కళ్లలోని ఆ కన్నీటి చుక్కను చూసిన క్షణంలోనే అయాన్ సిస్టమ్‌లో ఏదో తెలియని స్పందన మొదలైంది.

ఇది సాధారణమైన మెడికల్ అలర్ట్ కాదు.

ఆమెకు నొప్పి కలిగితే... తనలో ఎందుకు ఈ అసౌకర్యం?

ఆమె కళ్లలో నీళ్లు వస్తే... తన కోర్ ఎందుకు భారంగా మారుతోంది?

అతనికి సమాధానం తెలియదు.

కానీ ఆ క్షణంలో ఒక విషయం మాత్రం అతనికి స్పష్టంగా తెలుసు—

నీలను అలా బాధలో చూడటం అతనికి నచ్చడం లేదు.

అయాన్ ఆమెకు తన సెల్‌ఫోన్ అందించాడు.

“ఇది పట్టుకో.”

అని చెప్పి, ఎంతో జాగ్రత్తగా ఆమెను తన బాహువుల్లోకి ఎత్తుకున్నాడు.

అనుకోని ఆ పరిణామానికి నీల ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

పడిపోతానేమో అన్న భయంతో, తన రెండు చేతులను అయాన్ మెడ చుట్టూ వేసుకుంది.

ఆమె ముఖం అతని గుండెకు దగ్గరగా చేరింది.

అయాన్ మాత్రం ఎంతో స్థిరంగా అడుగులు వేస్తున్నాడు.

ప్రతి అడుగులోనూ ఆమెకు నొప్పి కలగకూడదన్న జాగ్రత్త.

నీల కళ్లను మూసుకుంది.

ఒకప్పుడు తనకు అయాన్ ఒక యంత్రం మాత్రమే.

కానీ ఇప్పుడు...

అతని బాహువుల్లో ఉన్నప్పుడు ఆమెకు అలా అనిపించడం లేదు.

తనను ప్రాణంలా కాపాడే ఒక మనిషి కౌగిలిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది.

అలా కొంత దూరం నడిచిన తర్వాత అయాన్ కారును చేరుకున్నాడు.

కారు డోర్ తెరిచి, నీలను ఎంతో జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టాడు.

ఆ తర్వాత కారును నడుపుతూ, వెలుతురు ఉన్న ప్రశాంతమైన ప్రదేశంలో ఆపాడు.

మళ్లీ ఆమెను తన చేతుల్లోకి తీసుకుని, పక్కనే ఉన్న బెంచి వద్దకు తీసుకెళ్లాడు.

నీలను నెమ్మదిగా కూర్చోబెట్టి, ఆమె కాలిని పరిశీలించాడు.

అయాన్ కళ్లలో ఒక నిర్ణయం కనిపించింది.

తన సిస్టమ్‌లోని మెడికల్ డేటాను యాక్టివేట్ చేశాడు.

కానీ...

ఆ డేటా కంటే ఎక్కువగా అతని ఆలోచనల్లో తిరుగుతున్నది ఒక్కటే—

“నీలకు నొప్పి తగ్గాలి.”

ఆ ఆలోచన ఎందుకు తన సిస్టమ్‌లో ఇంత బలంగా నమోదవుతోందో...

అయాన్‌కే అర్థం కాలేదు.

— 15వ అధ్యాయం సమాప్తం —