గత జ్ఞాపకాలు గీతిక మనసును కలచివేస్తున్నాయి. తనను ‘అనాథ’ అని అవమానించిన మాటలు, కోపంతో నాన్న తనకు దూరమైన క్షణాలు ఒక్కొక్కటిగా కళ్లముందు కదలాడాయి. ఆ బాధను భరించలేక, జీవితంపై ఆశ కోల్పోయి రోడ్డుపైకి పరుగెత్తింది. అంబులెన్స్ వేగంగా వస్తూ ఉండడంతో అటువైపు కదిలిన ఆమెను గౌరీ సకాలంలో కాపాడి గార్డెన్ హౌస్‌కు తీసుకొచ్చింది.
“గీతికా! ఏడవకు తల్లీ. కష్టాలు శాశ్వతం కాదు. చీకటి ఎంత గాఢంగా ఉన్నా, ఏదో ఒక మూల వెలుగు కనిపించకమానదు. మనసుకు ధైర్యం చెప్పుకుని, జీవితాన్ని కొత్త ఆశలతో ఆహ్వానించాలి. ధైర్యమే దేవుడని నమ్ము. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.” అంటూ గౌరీ ఆప్యాయంగా ధైర్యం చెప్పి ఇంటికి వెళతానని బయటికి అడుగుపెడుతుంది..
కానీ గీతిక మనసులోని బాధ అంత త్వరగా కరగలేదు. ‘నేను నిజంగానే ఒంటరినేనా? నాకంటూ ఎవరూ లేరా?’ అన్న ఆలోచనలు ఆమె గుండెను మౌనంగా తొలిచేస్తున్నాయి.
, గీతిక గదిలో కాళ్లు ముడుచుకుని కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తుండటం గౌరీ కి వినిపించడంతో. మనసు కుదుటపడక తిరిగి వచ్చి ఆమె పక్కన కూర్చుంది.
“ఆంటీ! నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా! నాకెందుకీ జీవితం? అడుగడుగునా అవమానాలే!” అంటూ గీతిక చిన్నపిల్లలా రోదించింది.
గౌరీ ఆమె కన్నీళ్లు తుడిచి, దగ్గరకు తీసుకుంటూ, “అలా అనకూడదు ,! నీ జీవితం ఇంకా ముగిసిపోలేదు. నీ చేతులతో జరగాల్సిన మంచి పని ఏదో మిగిలి ఉందేమో! కష్టాలు ఎదురైనప్పుడే మనలోని శక్తి మనకు తెలుస్తుంది,” అంది.
“కానీ, ఆంటీ! నేను ఏం చేసినా అవమానాలే ఎదురవుతున్నాయి. నా జీవితంలో ఇక ఏమీ మిగల్లేదనిపిస్తోంది,” అంది గీతిక నిరాశగా.
“గీతికా! నీకు ఎదురైన కష్టాలే ప్రపంచం అనుకోకు. నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక బాధ ఉంటుంది. కొందరు కన్నీళ్లతో చెబుతారు; మరికొందరు చిరునవ్వు వెనుక దాచుకుంటారు. చదువుతో పాటు జీవితాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. మన పురాణాలు, కథలు, అనుభవాలు మనకు ఎన్నో విలువలను నేర్పుతాయి. మనల్ని అవమానించిన మాటలే మన జీవితానికి ముగింపు కాకూడదు. మనం సాధించే విజయమే ఆ మాటలకు సమాధానం కావాలి. ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు తీరవు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే కొత్త దారులు కనిపిస్తాయి,” అని గౌరీ ప్రేమగా చెప్పింది.
ఆ మాటలు గీతిక మనసులో మెల్లగా మారుమోగాయి. ఇప్పటివరకు తన చుట్టూ చీకటే ఉందనుకున్న ఆమెకు, ఆ చీకటిని దాటితే వెలుగు కూడా ఉంటుందనే ఆలోచన కలిగింది.
గౌరీ ఆమె కళ్లలో మెరుస్తున్న చిన్న ఆశను గమనించి చిరునవ్వు నవ్వింది. “అదిగో! ఇప్పుడు నీ కళ్లలో కాస్త వెలుగు కనిపిస్తోంది. నిన్ను నువ్వు నమ్ముకో ! జీవితం నీకు మరో అవకాశం ఇస్తుంది,” అంటూ తల నిమిరి జాగ్రత్తరా అని చెప్పి తన ఇంటికి వెళుతుంది.
గౌరీ వెళ్లిపోయినా, ఆమె మాటలు గీతిక మనసులో నిలిచిపోయాయి. కిటికీలోంచి కనిపిస్తున్న పచ్చని మొక్కలను చూస్తూ, తన జీవితంలోనూ వసంతం వస్తుందేమోనని తొలిసారి ఆశగా ఆలోచించింది.బాధలతో నిండిన ఆమె హృదయంలో, ఆశ అనే చిన్న మొలక నిశ్శబ్దంగా తలెత్తింది.
అమ్మకు ఫ్రూట్స్ ఇచ్చి త్వరగా బయటకు వచ్చిన ప్రభ, వెళ్తూ వెళ్తూ గార్డెన్ హౌస్ వైపు చూశాడు. అక్కడ వెలుగుతున్న లైట్లను చూడగానే ఆందోళనతో కొట్టుకుంటున్న అతని గుండె కాస్త నెమ్మదించింది.
‘గీతిక ఇంట్లోనే ఉన్నట్టుంది. ఒకవేళ ఇంకా రాకపోయి ఉంటే జేజీ తాతయ్య ఈపాటికి నాకు ఫోన్ చేసేవాళ్లు కదా! అసలు గీతికకు ఏమైనా జరిగి ఉంటే? ఆ ఆలోచనే భరించలేకపోతున్నాను. తనకు ఏ చిన్న కష్టం వచ్చినా నా మనసు ఎందుకిలా తల్లడిల్లిపోతుంది? గీతిక ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తన కళ్లలో కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాకూడదు’ అని మనసులోనే అనుకున్నాడు.
బైక్‌ను ముందుకు పోనిస్తూ మరోసారి గార్డెన్ హౌస్ వైపు ప్రేమగా చూశాడు ప్రభ. ఆ వెలుగుతున్న దీపాల వెనుక, తన మనసుకు ఎంతో దగ్గరైన గీతిక క్షేమంగా ఉందన్న నమ్మకం అతని పెదవులపై చిన్న చిరునవ్వును తెచ్చింది. ఆమెకు తెలియకపోయినా, ఆమె క్షేమం కోసం తపించే ఒక మనసు మాత్రం అక్కడి నుంచి భారంగా కదులుతోంది.
గౌరీ వెళ్ళిన తర్వాత బోసిగా ఉన్న ఇంటిని చూసి చాలా బాధపడుతుంది అయినా గారు చెప్పిన మాటలు ఒక్కొక్కటి గుర్తుకు రావడంతో తనలో ఉన్న చీకటి కోణం కాస్త తగ్గుతూ వెలుగు దారి చూపిస్తున్నట్టు అనిపించింది.
నిజంగా ఆంటీ మాటలు నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నది ఆంటీ చరవ ఇచ్చినంత మాత్రాన మనం వెళ్ళలేను కదా ఆంటీ మీరన్నారు కదా నేను ఆత్మీయురాలిన అని అనుకుంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు గాని నాకు ఒక ఫోన్ చెయ్ మని నిజంగా మీరు ఆత్మీయురాలు అనిపిస్తుంది. నిజంగా అమ్మలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే తనలో ఏదో కొత్తగా ఉదయం వెలుగుతున్నట్టు అనిపించింది.
‘నా బాధ ఏదైనా సరే... నేనే భరించాలి. నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకోవాలి. అలా బతకాలంటే నాకు నేను స్వతంత్రంగా నిలబడాలి. అందుకోసం ఈ ఇంటికి, ఇక్కడి మనుషులకు దూరంగా వెళ్లిపోవాలి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేని ఈ గార్డెన్ హౌస్‌లో ఇంకా ఎన్నాళ్లని ఉండాలి? వాళ్ల ఇల్లు వాళ్లకు వదిలేసి, ఎవరికీ తెలియని దూరపు ప్రాంతానికి వెళ్లిపోతాను.
ఇన్నాళ్లూ నాన్న అయినా నన్ను అర్థం చేసుకుంటారని, నా బాధను గుర్తించి నన్ను ఆదరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ చివరికి ఆ ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఇక అమ్మ గురించి ఆలోచించకూడదు. నేను ఎంత నిజాయితీగా ఉన్నా నన్ను అనుమానించి, నేనున్న చోటికి మరో మనిషిని పంపించి నా గురించి ఆరా తీయిస్తుందా? అదే నన్ను కన్న అమ్మ అయితే ఇలా చేసేదా?
పాపం, నా వల్ల నాన్న ఎంత బాధపడుతున్నారో! అమ్మ ఎన్ని మాటలతో ఆయన్ని హింసిస్తుందో ఏమో! నా కారణంగా నాన్న ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి? నేనే లేకపోతే కనీసం ఆయనైనా ప్రశాంతంగా ఉంటారేమో!
నా తమ్ముడు బంగారం అంటే నాకు ప్రాణం. వాడిని చూడకుండా, వాడితో మాట్లాడకుండా ఉండటం నాకు ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. కానీ వాడికి కూడా నన్ను దూరం చేస్తోంది. నేను ఇక్కడే ఉంటే నా వాళ్లకు మరింత దూరమవ్వాల్సి వస్తుంది. అందుకే ఈ ఇంటిని వదిలి వెళ్లిపోతాను. నా ఆనవాళ్లు కూడా ఎవరికీ తెలియకుండా దూరంగా వెళ్లిపోతే, కొన్నాళ్లకైనా నన్ను మర్చిపోతారేమో!’
ఆలోచనలతోనే కళ్ల నిండా చేరిన కన్నీళ్లను తుడుచుకుంది గీతిక. తన సర్టిఫికెట్లను మాత్రమే బ్యాగులో సర్దుకుని, తలకు ఉన్న చిన్న కట్టును విప్పి పక్కన పడేస్తూ తన మనసులోని బాధను కూడా అలా తీసి పక్కన పడేయగలిగితే ఎంత బాగుండునో అనుకుంది.
బ్యాగ్ తీసుకుని ఇంటి బయటకు వచ్చి తలుపు మూసి తాళం వేసింది. ఆ ఇంటిని చివరిసారిగా చూసి, గుండెల్లోని బాధను దిగమింగుకుంటూ ముందుకు అడుగు వేసింది. రెండడుగులు వేయగానే ఎదురుగా నారాయణ కనిపించాడు.ఒక్కసారిగా గీతిక అడుగులు ఆగిపోయాయి. కాసేపు నిశ్శబ్దం గీతిక తటస్థoగా నిలబడింది.
నారాయణను చూడగానే గీతిక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎదురుగా తన తండ్రి! ఇన్నాళ్ల తర్వాత, అదీ ఇలా అనుకోకుండా కనిపిస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. క్షణకాలం ఆమె చూపులు ఆయన ముఖంపైనే నిలిచిపోయాయి. మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఎన్నో రోజులుగా చూడాలనుకున్న ముఖమే అయినా, ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంటే మాత్రం ఆయన కళ్లలోకి చూసే ధైర్యం రావడం లేదు. ఆరోజు ఎందుకు అవమానించినట్టు ?ఈరోజు ఎందుకు వచ్చినట్టు? అనాధని కదా నన్ను ఒంటరిగా వదిలేశాడు బహుశా ఈ ఇంటి నుంచి నన్ను పంపియాలని ఉద్దేశంతోనే వచ్చారేమో
పైగా అండగా ఉంటారనుకున్న తాతయ్య, జేజీలను సైతం తనతో పాటు ఊరికి తీసుకెళ్లి, తనను ఒంటరిని చేసిన ఆ క్షణాలు తన కళ్లముందు కదలాడాయి. అప్పటివరకు తనకు ఓదార్పునిచ్చిన అమ్మ జ్ఞాపకం గుండెను మెలిపెట్టింది నా కన్నతల్లి ఉండి ఉంటే నా బాధను అర్థం చేసుకునేది. నా కన్నీళ్లు తుడిచి, గుండెకు హత్తుకుని ఓదార్చేది. కానీ ఇప్పుడు నా కన్నీళ్లను తుడిచేవారెవరు? నా మనసులోని మాటను వినేవారెవరు?
ప్రేమగా దగ్గరికి తీసుకొని ఓదార్చే వాళ్లే అనుమానించి ,అవమానించి వెళ్ళిన తర్వాత వారి ముఖం చూడటానికి మాత్రం నా మనసు అంగీకరించడం లేదు.
ఒకప్పుడు తనకు ఏ కష్టం వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు అదే నాన్న ఎదురుగా నిలబడితే, గుండెను రాయి చేసుకోవాలని మనసు చెబుతుంది. అందుకే నేను వెళ్ళిపోవడమే మంచిది అనుకొని ఒక్కసారి వాచి వైపు చూసుకుంది. ఇక్కడే కాసేపు ఉన్నట్లయితే నాకు బస్ మిస్ అవుతుంది అనుకుని ఒకసారి బ్యాగ్ ను చూసింది.
'నేను ఇప్పుడు వారికి సంబంధించిన కూతుర్ని కాదు కాదు మనిషిని కాదు. వాళ్ల ఇంటికి వాళ్లు వచ్చినట్టున్నారు. వాళ్ల దారిలో వాళ్లు వెళ్తారు. నా దారిలో నేను వెళ్తాను. నాకంటూ ఒక జీవితం ఉంది. నాకంటూ కొన్ని ఆశయాలున్నాయి. నన్ను ఒంటరిగా వదిలేసినప్పుడు లేని బంధం, ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తుకు రావాలి?'అందుకే
'వాళ్లకు సంబంధించిన ఏ వస్తువునీ నేను తీసుకోలేదు. వాళ్ల ఇంటి నుంచి ఒక్క వస్తువు కూడా నాతో తెచ్చుకోలేదు. కానీ నాన్న చదివించిన చదువు మాత్రం నాతో ఉంది. దాన్ని కూడా వదిలేయాలా? అది ఆయన పెట్టిన భిక్ష కాదు కదా! ఆ చదువు కోసం నేను కూడా కష్టపడ్డాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో కన్నీళ్లు దిగమింగాను. ఎన్నో అవమానాలు భరించాను. ఆ చదువు వెనుక నా కష్టం ఉంది, నా పట్టుదల ఉంది, నా భవిష్యత్తు ఉంది. అలాంటప్పుడు దాన్ని తలచుకుని నేను ఎందుకు బాధపడాలి?'
ఆ ఆలోచనతోనే బ్యాగ్‌ను భుజానికి సర్దుకుంది. తనలోని బాధను కోపంగా మార్చుకుని, అక్కడి నుంచి వెళ్లిపోవడానికి అడుగు ముందుకు వేసింది
కానీ ఆ అడుగు వేయడం అంత సులభం కాలేదు.
ఎదురుగా ఉన్నది తనను బాధపెట్టిన వ్యక్తి మాత్రమే కాదు... తనను మొదటిసారి నడవడం నేర్పించిన తండ్రి. తన చిన్ననాటి జ్ఞాపకాలలో భాగమైన మనిషి. తనకు ఎన్నో ఆశలు చూపించిన వ్యక్తి. ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా మనసును చుట్టుముట్టాయి. అయినా, ఆ జ్ఞాపకాల కోసం మరోసారి తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడానికి గీతిక సిద్ధంగా లేదు. మనసును గట్టిపరుచుకుని నారాయణ పక్క నుంచి తన అడుగును ముందుకు పెడుతుంది.