లెటర్‌ను ముక్కలు ముక్కలుగా చింపి డస్ట్‌బిన్‌లో వేసింది కీర్తి. దొరికిందే ఛాన్స్ అనుకుని బయటికి వెళ్లిపోవడానికి అడుగు వేస్తుండగా...
“ఓయ్... ఆగు! ఎక్కడికి వెళ్తున్నావ్?” అని విరాట్ గొంతు వినిపించడంతో అక్కడే ఆగిపోయింది.
చూసేశాడా? అంటే సార్ లెటర్ చదవడం అయిపోయింది కదా! అందుకే వెళ్తున్నా... అని మనసులో అనుకుంటూ,
“సార్... లెటర్ చదవడం అయిపోయింది కదా! అందుకే...” అంటూ నీళ్లు నమిలింది కీర్తి.
“నేను వెళ్లమని చెప్పానా?”
“లేదు సార్...” అన్నట్టుగా తల ఊపింది.
“మరి?”
విరాట్ వెనక్కి పిలవడంతో చేసేదేమీ లేక అతని దగ్గరికి వెళ్లింది కీర్తి.
“అసలు నువ్వు కాలేజ్‌కి దేనికి వస్తున్నావ్?”
“సార్...”
“చెప్పు! కాలేజ్‌కి దేనికి వస్తున్నావ్? ఒక్క క్లాస్ కూడా సరిగ్గా వినవు. ఎప్పుడూ చూసినా బయట తిరుగుతూనే ఉంటావ్. క్లాస్ చెప్తున్నప్పుడు పడుకుంటావ్...
క్లాస్ మధ్యలో తింటావ్... అసలు నీకు డిసిప్లిన్ అనేది లేదు! బయట నిలబెట్టినా పాటలు పాడుకుంటూ ఉంటావ్. మరి ఏం చేయడానికి వస్తున్నావ్ కాలేజ్‌కి? ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రాయబారం కూడా మొదలుపెట్టావ్!”
విరాట్ వరుసగా తిడుతుంటే కీర్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా తలదించుకుని నిలబడింది.
“ఇంకోసారి ఇలాంటి లెటర్స్ తీసుకొచ్చి ఇవ్వడం చూశానంటే ప్రిన్సిపాల్‌తో మాట్లాడి నీకు TC ఇప్పిస్తా! వెళ్లు!”
“సారీ సార్...” అని చెప్పి కీర్తి వెళ్లిపోతుండగా,
“రేపటి నుంచి నువ్వు బ్యాక్ బెంచ్‌లో కాదు... ఫస్ట్ బెంచ్‌లో కనిపించాలి!” అన్నాడు విరాట్.
అమ్మో! బ్యాక్ బెంచ్ కూడా పోయిందా? అని మనసులో అనుకుంటూ,
“ఓకే సార్...” అని చెప్పి బయటికి వెళ్లిపోయింది కీర్తి.
@@@@@@@
బయట కీర్తి కోసం ఎదురుచూస్తున్న ప్రియకి, కీర్తి బయటికి రావడం కనిపించింది.
“కీర్తి! వచ్చేశావా? ఏమైందే? విరాట్ సార్ ఏమన్నారు? నిన్ను తిట్టారా?” అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది ప్రియ.
“నీ క్వశ్చన్స్ ఆపవే! ముందు క్యాంటీన్‌కి వెళ్దాం పద!” అని ప్రియను తీసుకుని క్యాంటీన్‌కి వెళ్లిపోయింది కీర్తి.
ఇద్దరూ కూర్చోగానే,
“ఇప్పుడు చెప్పవే! అసలు విరాట్ సార్ ఏమన్నారు?” అని ఆసక్తిగా అడిగింది ప్రియ.
కీర్తి లోపలికి వెళ్లిన దగ్గరి నుంచి బయటికి వచ్చేవరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది.
కీర్తి చెప్పడం పూర్తయిన తర్వాత కూడా దాదాపు పది నిమిషాల పాటు నవ్వుతూనే ఉంది ప్రియ.
“ఏంటే! అంతలా నవ్వుతున్నావ్? ఆ విరాట్ సార్ తిట్లు తిన్నది నేను!” అని చిరాకుగా అంది కీర్తి.
“అబ్బా! నిన్ను ఫస్ట్ బెంచ్‌లో కూర్చోమన్నారంటే ఇక నీ పని అయిపోయినట్టే!” అంటూ మళ్లీ నవ్వింది ప్రియ.
“సరే, సరే! ఇప్పుడు నాకు ఆ భవ్య కనిపించాలి. దానికి ఉంది నా చేతిలో!” అని కోపంగా అంది కీర్తి.
అప్పుడే అక్కడికి వచ్చింది భవ్య.
“కీర్తి! విరాట్ సార్‌కి లెటర్ ఇచ్చేశావా? సార్ ఏమన్నారు?” అంటూ ఎంతో ఉత్సాహంగా అడిగింది.
“వచ్చావా అమ్మా! రా... నీ కోసమే ఎదురుచూస్తున్నా!” అంది కీర్తి కోపంగా.
“విరాట్ సార్‌కి లెటర్ ఇచ్చావా?”
“హా... ఇచ్చాను! నీ అమర ప్రేమికుడు ఆ లెటర్ తీసుకుని ముక్కలు ముక్కలు చేసి డస్ట్‌బిన్‌లో పడేశాడు. వెళ్లు, వెళ్లి ఏరుకో!” అంది వెటకారంగా.
“ఏంటి? లెటర్ చింపేశారా?” అని బాధగా అడిగింది భవ్య.
“అసలు ఆ లెటర్ ముందు నేను ఓపెన్ చేసి చూసుంటే నేనే చింపేసేదాన్ని! అంత దారుణంగా రాశావ్!”
“అయినా ఆ దొండకాయలు, బెండకాయలు, ఆకులు, పువ్వులు ఏంటే ఆ లెటర్లో? గూగుల్‌లో కొడితే బోలెడన్ని కవితలు వస్తాయి. అందులో చూసి రాసుకోవచ్చు కదా! నీ సొంత ప్రయోగాలు అవసరమా?” అంటూ భవ్యను ఆటపట్టించింది కీర్తి.
తను ఎంతో ప్రేమగా రాసిచ్చిన లెటర్‌ను విరాట్ చింపేశాడన్న బాధతో భవ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
“కీర్తి! మనకి ఇప్పుడు క్లాస్ ఉంది. పద వెళ్దాం!” అని ప్రియ అనడంతో ఇద్దరూ క్లాస్‌కి వెళ్లిపోయారు.
@@@@@@@
సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత కీర్తి, ప్రియ ఇద్దరూ బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో కూర్చున్నారు.
“ఏంటే! అభి కోసమే కదా వెయిట్ చేస్తున్నావ్?” అని అడిగింది ప్రియ.
“అదేం లేదే! చల్లగా ఉంది కాబట్టి కూర్చున్నా!” అంది కీర్తి.
“నీ నాటకాలు నా దగ్గర కాదు! అయినా ఇంకా ఎన్ని రోజులే? అభికి ప్రపోజ్ చేయొచ్చు కదా!” అంది ప్రియ.
“ఇంక చాలు, ఆపవే! తను నా క్రష్. అంతమాత్రాన ప్రపోజ్ చేయమంటావేంటి?” అంది కీర్తి సిగ్గుపడుతూ.
“హ్మ్మ్... సంవత్సరం నుంచి ఇదే మాట వింటున్నా. ఇంకా క్రష్ ఏనా? ఒకవేళ అభి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే?” అని ప్రియ అడిగింది.
ఆ మాట వినగానే కీర్తి బుగ్గలు ఎర్రబడ్డాయి.
“ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో!” అంది సిగ్గుగా.
“అయినా అభి నన్ను ఒక ఫ్రెండ్‌లానే చూస్తున్నాడు. తన మనసులో నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు తెలియదు కదా!” అంటూ కాస్త దిగులుగా అంది కీర్తి.
అంతలోనే...
“హాయ్ కీర్తి! హాయ్ ప్రియ!” అంటూ అక్కడికి వచ్చాడు అభి.
“హాయ్ అభి! నీ బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ అయిపోయిందా?” అని అడిగింది కీర్తి.
“హా, అయిపోయింది. రేపు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నీకు?” అని కీర్తిని అడిగాడు అభి.
“ఏం లేవు. ఎందుకు?”
“రేపు కొత్త మూవీ రిలీజ్ అవుతోంది. వెళ్దామా?” అని అడిగాడు అభి.
“రేపు క్లాసెస్ ఉన్నాయి కదా...” అంది కీర్తి.
“ఏయ్! ఏంటే నీ ఓవరాక్షన్? అభి సినిమా చూడడానికి పిలుస్తుంటే క్లాస్ ఉంది అంటావా?” అంటూ మధ్యలోనే అందుకుంది ప్రియ.
“మరీ పిలిచిన వెంటనే వచ్చేస్తాను అంటే బాగోదేమోనే!” అంది కీర్తి సిగ్గుపడుతూ.
“నీ మొహం! ఏం కాదు. వస్తాను అని చెప్పు!” అంది ప్రియ.
“సరే...” అంది కీర్తి.
“రేపు మధ్యాహ్నం వెళ్దాం అభి. నీకు ఓకేనా?” అని అడిగింది ప్రియ.
“హా, ఓకే!” అన్నాడు అభి.
“సరే, పదండి! మళ్లీ బస్ దొరకదు!” అని ప్రియ అనడంతో ముగ్గురూ లేచి కాలేజ్ ఎగ్జిట్ గేట్ వైపు నడిచారు.
ప్రియకి ఫోన్ రావడంతో తను మాట్లాడుతూ వెనకే నడుస్తోంది. అభి, కీర్తి మాత్రం పక్కపక్కనే నడుస్తున్నారు.
అభి ఏదో జోక్ చెప్పడంతో కీర్తి నవ్వింది.
“నీ బ్యాంగిల్స్ బాగున్నాయి, కీర్తి!” అంటూ ఆమె చేతిని పట్టుకుని గాజులు చూడసాగాడు అభి.
అభి తన చెయ్యి పట్టుకోవడంతో కీర్తి మొహం సిగ్గుతో ఎర్రబడింది.
అదే సమయంలో అటువైపుగా వస్తున్న విరాట్, అభి కీర్తి చెయ్యి పట్టుకోవడం చూశాడు. కానీ తనకేమీ పట్టనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు.
విరాట్‌ను చూసిన కీర్తి ఒక్కసారిగా అభి చేతిలో నుంచి తన చెయ్యి తీసేసింది.
అమ్మో! నా పని అయిపోయింది! ఇక ఈ కాలేజ్‌తో నా రుణం తీరిపోయినట్టే! ఈ సైకోకే కనిపించాలా? పడకపడక ఈయన కంట్లోనే పడాలి! ఇందాకే తిట్లు పడ్డాయి... మళ్లీ ఇప్పుడు దొరికిపోయాను! అని ఏడుపు మొహం పెట్టుకుంది కీర్తి.
“ఏమైంది కీర్తి? మొహం అలా పెట్టావేంటి?” అని అడిగాడు అభి.
“ఏం లేదు అభి!”
“సరే, రేపు మార్నింగ్ వచ్చి నీకు టికెట్ ఇస్తాను.”
“హా, సరే! నీకు టైమ్ అవుతున్నట్టుంది. నువ్వు వెళ్లు. నేను ప్రియ కోసం వెయిట్ చేస్తాను.”
“సరే, బై! మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్లండి!” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అభి.
అభి వెళ్లిపోయిన వెంటనే కీర్తి విరాట్ వైపు పరుగెత్తింది.
వేగంగా పరిగెత్తడం వల్ల బ్యాలెన్స్ తప్పి విరాట్‌ను గుద్దుకుని కింద పడబోయింది. వెంటనే విరాట్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు.
అదే సమయంలో ఒక బైక్ కీర్తి వైపు రావడం గమనించి, ఆమె చెయ్యి పట్టుకుని బలంగా పక్కకు లాగాడు.
అలా లాగడంతో కీర్తి వచ్చి విరాట్ తలను గుద్దుకుంది.
“అబ్బా!” అంటూ తల మీద చెయ్యి వేసుకుని విరాట్ వైపు చూసింది. ఆ తర్వాత ఏదో గుర్తొచ్చినట్టు మళ్లీ అతని తలను గుద్దింది.
“ఏయ్! ఏం చేస్తున్నావ్?” అని కోపంగా అడిగాడు విరాట్.
“అంటే సార్... ఒక్కసారి గుద్దితే కొమ్ములు వస్తాయని అంటారు కదా! అందుకే ఇంకోసారి కూడా గుద్దాను!” అంది అమాయకంగా ముఖం పెట్టి.
“నీకు ఆల్రెడీ కొమ్ములు ఉన్నాయి కదా! ఇంకా ఎలా వస్తాయి?” అన్నాడు విరాట్ వెటకారంగా.
అయినా కొమ్ములు నాకు కాదు, మీకు ఉంటాయి! ఎందుకంటే మీరు రాక్షసులు కాబట్టి! అని మనసులోనే తిట్టుకుంది కీర్తి.
“అయినా ఏంటి? అంత ఫాస్ట్‌గా వచ్చావ్? ఏమైంది?” అని అడిగాడు విరాట్.
“సార్... ఇందాక నా పక్కన నిల్చున్న అబ్బాయి అభి. తను నా ఫ్రెండ్. నా గాజులు బాగున్నాయని నా చెయ్యి పట్టుకున్నాడు. అంతే సార్! అంతకు మించి ఏమీ లేదు!” అని గబగబా చెప్పేసింది కీర్తి.
“ఏయ్! ఆగు! ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావ్?” అని అడిగాడు విరాట్.
“అంటే సార్... మళ్లీ మీరు తిడతారు కదా! అందుకే నేనే ముందుగా చెప్పేస్తున్నాను!”
“నేనెందుకు తిడతాను? నీ పర్సనల్ లైఫ్‌తో నాకేం సంబంధం?”
“కాలేజ్ టైమ్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినా నాకు అనవసరం. అది నీ ఇష్టం!” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు విరాట్.
విరాట్ మాటలకు కీర్తి షాక్ అయింది.
నన్ను తిడతాడనుకుంటే... నాకు సంబంధం లేదు అంటాడేంటి? సర్లే! ఈరోజుకి తిట్లు తప్పాయి! అని మనసులోనే అనుకుంది.
“సార్...” అంటూ అతని వైపు చూసేసరికి విరాట్ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కీర్తి వెనక్కి తిరిగేసరికి ప్రియ కనిపించింది.
“ఇక్కడున్నావా? నీ కోసం వెతుకుతున్నా! అయినా ఇక్కడికి ఎందుకొచ్చావే?” అని అడిగింది ప్రియ.
జరిగిన విషయమంతా ప్రియకు చెప్పింది కీర్తి.
“అందుకే విరాట్ సార్‌ని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు!” అంది ప్రియ.
“విరాట్ సార్‌కి లవర్ ఉందా?” అని అడిగింది కీర్తి.
“ఏమో! నాకేం తెలుసు? అయినా భవ్య అన్నట్టు సార్ నీతో మాట్లాడతారు కదా! నువ్వే అడుగు... ‘సార్, మీకు లవర్ ఉందా?’ అని!” అంటూ నవ్వింది ప్రియ.
“నేనెందుకు అడుగుతాను? నాకు ఇంకా ఈ కాలేజ్‌లో ఉండాలని ఉంది. TC తీసుకుని వెళ్లిపోవాలని లేదు!” అంది కీర్తి.
“అయినా ఒకవేళ లవర్ ఉంటే పాపం! ఆ అమ్మాయి ఈ సైకోని ఎలా భరిస్తుందో ఏంటో!” అంటూ నిట్టూర్చింది.
“సర్లే! బస్కి టైమ్ అవుతోంది. త్వరగా వెళ్దాం పద!” అని ప్రియ అనడంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
To be continued ❤️