పెళ్లిచూపుల నుంచి తిరిగొచ్చిన ప్రభ మంచంపై పడుకున్నాడు. మనసులో చెప్పలేనంత కోపం ఉప్పొంగుతోంది. ఎలాగోలా ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నా, అతనికి సాధ్యం కావడం లేదు. ఆ కోపాన్ని ఎవరిమీద చూపించాలో తెలియక తనలో తానే సతమతమవుతున్నాడు.
ఏ సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించగలిగే నేను, ఇప్పుడు నా మనసులోని ఈ అలజడిని ఎందుకు అదుపు చేసుకోలేకపోతున్నాను?
ప్రేమ! చూడటానికి రెండు అక్షరాల చిన్న పదమే. కానీ, దాని ప్రభావం ఎంత బలమైనది! అయస్కాంతంలా మనసును తనవైపు లాగేసుకుంటుంది. ఆ అమ్మాయి ఉత్తర ధ్రువమైతే, నేను దక్షిణ ధ్రువంలా తనవైపు ఆకర్షితుడినవుతున్నానా? అందుకేనా ఈ ఆకర్షణ?
గీతికా! నా జీవితంలో ఇప్పటివరకు దేనికోసమూ ఇంతగా మదనపడలేదు. ఎందుకంటే, నాకు ఏం కావాలో, ఏది మంచో అమ్మే చూసుకుంది. నా అవసరాలను తీర్చింది. నా జీవితానికి ఒక దారిని చూపించింది.
పాపం! ఎంత ఆశగా ఎదురుచూసి ఉంటుందో! పెళ్లిచూపుల నుంచి వచ్చాక నేను ఏదో ఒక శుభవార్త చెబుతానని ఎన్నో కలలు కని ఉంటుంది. కానీ, నేనేం చేశాను? తన ఆశలన్నింటినీ ఒక్క క్షణంలో నీరుగార్చేశాను.
అయినా, అమ్మ ఇప్పటివరకు చేసింది నా జీవనానికి అవసరమైన మార్గాన్ని చూపించడమే. కానీ, ఇకపై నా జీవితానికి సరైన దారిని ఎంచుకోవాల్సింది నేనే. ఎందుకంటే, అమ్మ నాకు దారి చూపించగలదే కానీ, నాతోపాటు జీవితాంతం నడిచే వ్యక్తి మాత్రం మరొకరు. ఆ వ్యక్తితో కలిసి నడవాల్సింది నేను. ఆమెను అర్థం చేసుకుని, ఆమె మనసును గౌరవిస్తూ, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను కలిసి ఎదుర్కోవాల్సింది కూడా నేనే.
అందుకే అమ్మకు నా పెళ్లి విషయంలో అంత ఆత్రుత. నా జీవితం ఒక గాడిలో పడితే చాలు, అంతకంటే తనకు కావాల్సిందేమీ లేదు.
కానీ, నేనేం చేస్తున్నాను? చాందిని జ్యూస్ అందించే సమయంలో కూడా గీతికే గుర్తుకొచ్చింది. అంటే, నా అణువణువునా గీతిక నిండిపోయిందా? నా నరనరాల్లో ప్రతిక్షణం తన జ్ఞాపకాలే మీటుతున్నాయా?
అటు అమ్మను సంతోషపెట్టలేక, ఇటు నా మనసుకు నచ్చిన అమ్మాయిని దక్కించుకోలేక ఎందుకిలా సతమతమవుతున్నాను? నా అంతట నేనే గీతికను ఇష్టపడినందుకే నాకు ఇంత బాధగా ఉంటే, ఒకవేళ ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడితే, ఈ బాధే ఒక మధురమైన అనుభూతిగా మారుతుందేమో!
ఆలోచనలతో సతమతమవుతున్న ప్రభకు ఇంతలో తల్లి పిలుపు వినిపించింది.
“ప్రభా! ఇలా రా, కూర్చో!” అంటూ గౌరీ సోఫాను చూపించింది.
తల్లి పిలుపుతో గదిలో నుంచి బయటకు వచ్చిన ప్రభ, ఆమె ఎదురుగా కూర్చున్నాడు.
“ప్రభా! ఆ అమ్మాయికి నీ మీద అలాంటి అభిప్రాయం లేదని చెప్పిందట. మీ మేడమ్ నాకు చెప్పారు” అంటూ గౌరీ కొడుకు తలను ఆప్యాయంగా నిమిరింది.
“అమ్మా! నీకు ఒక నిజం చెప్పాలి. చాందిని నా క్లాస్మేట్. తన గురించి నాకు బాగా తెలుసు. కానీ, తన మీద నాకు అలాంటి అభిప్రాయం లేదమ్మా!” అన్నాడు ప్రభ చిన్నపిల్లాడిలా.
కొడుకు మాటలు విన్న గౌరీ చిరునవ్వు నవ్వింది.
“సరేలేరా! అభిప్రాయాలు కలవనప్పుడు అభిమానం పెరగదు. అనురాగం బలపడదు. అలాంటప్పుడు కలిసి జీవించే జీవితమూ సంతోషంగా సాగదు. కాబట్టి, నువ్వేమీ బాధపడకు. మరో సంబంధం చూద్దాం. ఇన్నాళ్లూ నేను చెప్పిన మాట విని చదువుకున్నావు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు. ఇక నీ జీవితానికి తగిన భాగస్వామిని ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే, ఏ అమ్మాయి అయినా నీకు నచ్చితేనే నేను ముందడుగు వేస్తాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోను” అని కొడుకుకు నచ్చజెప్పింది.
తల్లి మాటలు విన్న ప్రభ మనసు ఒక్కసారిగా తేలికపడింది.
“థాంక్యూ వెరీ మచ్, అమ్మా! నువ్వు నిజంగా చాలా మంచిదానివి!” అంటూ తల్లిని ఆప్యాయంగా హత్తుకుని నవ్వాడు.
అయితే, ఆ నవ్వు వెనుక దాగున్న బాధను అతని మనసు మాత్రమే ఎరుగుతుంది.
ప్రభ బైక్ ఎక్కి స్టార్ట్ చేసి ముందుకు సాగాడు. రోడ్డు మీద బండి వెళ్తున్నా, అతని ఆలోచనలు మాత్రం గీతిక చుట్టూనే తిరుగుతున్నాయి.
తాతయ్య చెప్పిన మాటలు పదేపదే గుర్తుకొస్తున్నాయి.
శ్రీమన్నారాయణ చాలా గొప్ప తండ్రి! కూతురి గురించి చిన్నప్పటి నుంచి అన్నీ తెలిసినవాడై ఉండి కూడా, ఆమెను అనుమానించి అవమానించాడు. ఇప్పుడు మరో కారణంతో ఆమెను ఒప్పించి, మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు.
అయినా, అతన్ని నిందించి ప్రయోజనమేముంది? తప్పు అతనిదే కావచ్చు. కానీ, ఆ బాధను మోస్తున్నది మాత్రం గీతిక. తన చుట్టూ ఇన్ని సమస్యలు ఉన్నా, తనను ప్రాణంగా ప్రేమించే ఒక మనిషి ఉన్నాడని తెలిసినా, కనీసం అతని ప్రేమను గుర్తించే ప్రయత్నం కూడా చేయడం లేదు.
తన మనసనే సాగరంలో నా ప్రేమ చిన్న అలనైనా రేపలేకపోయిందా? ఎందుకు రేపుతుంది? సాగరం అనగానే అలలు, ఆటుపోట్లు గుర్తుకొస్తాయి. కానీ, గీతిక జీవితంలో ఇప్పటివరకు అలల తాకిడే తప్ప, ప్రశాంతత ఎక్కడుంది?
ఒకవైపు తల్లి, మరోవైపు తండ్రి, ఇంకోవైపు సమాజం... చివరికి నేను కూడా నా ప్రేమతో ఆమె మనసును కలవరపెట్టాను. పాపం! ఇన్ని అలల మధ్య చిక్కుకుని ఎంతగా తల్లడిల్లిపోతుందో!
నాన్న వచ్చాడు కాబట్టి, ఇకనైనా తన మనసు కాస్త కుదుటపడుతుందని అనుకున్నాను. కానీ, ఇప్పుడు మరో పెద్ద తుఫాను ఆమె జీవితాన్ని చుట్టుముట్టినట్టుంది. నారాయణ రేపిన ఆ అలజడి ఆమె భవిష్యత్తుకు సంబంధించినది. ఎంతైనా నాన్న కూచి కదా! చివరికి తన తండ్రి మాటకే తలవంచుతుందేమో!
అదే జరిగితే నా ప్రేమ ఏమైపోవాలి? నా ఆశలన్నీ ఏమైపోవాలి?
ఆలోచనలతో ప్రభ మనసు భారమైంది.
నేను నా మనసును అర్థం చేసుకునే వయసుకు వచ్చిన తర్వాత, నన్ను ఇష్టపడి ప్రేమను వ్యక్తం చేసిన అమ్మాయిలు లేకపోలేదు. కానీ, నా మనసు ఎప్పుడూ వారి వైపు వెళ్లలేదు. మరి, గీతికనే ఎందుకు ఇలా ఇష్టపడుతున్నాను? ఆ సంక్రాంతి సంబరాల్లో తొలిసారి తనను చూసినప్పటి నుంచి నా మనసు తనకే ఎందుకు అంకితమైపోయింది?
గీతికా! నీకు దగ్గరవుదామని నేను ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే, నువ్వేమో వెనక్కి అడుగులు వేస్తున్నావు. మన మధ్య ఉన్న చిన్న దూరం కాస్తా ఆరడుగుల దూరమైపోయింది. ఇంతవరకు ఒక్కసారైనా నా వైపు మనస్ఫూర్తిగా చూడలేదు. నీ మౌనం నా మనసును ముడుచుకున్న మల్లెపువ్వులా మార్చేసింది.
అయినా, నా మనసులో ఎక్కడో ఒక మూల చిన్న ఆశ తొణికిసలాడుతూనే ఉంది. కానీ, ఇప్పుడు మీ నాన్న రాకతో ఆ ఆశ కూడా క్రమంగా ఆవిరైపోతున్నట్టుంది.
గీతికా! నిజంగా మల్లెపువ్వులాంటి స్వచ్ఛమైన మనసు నీది. ఆ మనసులో స్థానం సంపాదించుకునే అదృష్టవంతుడు ఎవరో కానీ, అతను నిజంగా అదృష్టవంతుడే! ఆ అదృష్టం నన్నే వరించాలని ఎన్ని కలలు కన్నానో! ఎన్నో కథలు రాశాను. నా ఊహల్లో నీతో కలిసి ఎన్నో మధురమైన క్షణాలను గడిపాను. కానీ, నా మనసుకు ఇంత దగ్గరైన నువ్వు, నన్ను మాత్రం ఎందుకింత దూరం పెడుతున్నావు?
అతని మనసులో భావాలు పదాలుగా రూపుదిద్దుకున్నాయి. ప్రేమతో నిండిన అతని హృదయం గీతిక కోసం ఒక గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టింది.
ఓ చెలి అనార్కలి!
ఓ చెలి అనార్కలి!
నెచ్చెలీ, ప్రియ జావళీ!
ఎరుగవటే నా ఎద ఘోషని?
మరుగవటే నా మది బాధని?
ఎద నిండుగా దాగున్న
నీపై నా ప్రేమని,
నీ మిడిమిడి చూపులు నాపై కురిపించి
మురిపెంగా నన్ను తాకిన క్షణాల్ని...
కొంటెతనంతో అల్లరి రేపి,
పిల్లనగ్రోవై నా మనసున మోగి,
పులకించి పలికిన నా యదలయను
ఒక్కసారైనా ఆలకించవా?
నా కనుపాపను చేరి నిన్ను చూసిన
ఆ తొలిచూపే నీ ప్రతిమను
నా మమతల కోవెలలో నిలిపింది.
ఆ గుడి గంటల సవ్వడి
నన్ను మైమరపింపజేసింది.
నేను నిన్ను తలవని క్షణం లేదు,
నిన్ను చేరాలన్న ఆశ పోలేదు.
నీ కోసం తపించిన అలసట రాలేదు,
నీపై కలిగిన ప్రేమ ఎన్నటికీ తీరదు!
నీవు నాకు దూరమైనా కోపం రాదు,
నువ్వెన్ని పరీక్షలు పెట్టినా అలక రాదు.
నీ మౌనం నా ప్రేమను తుంచలేదు,
నీ నిరాకరణ నా ఆశను చంపలేదు!
ఎందుకంటే, నాది నిజమైన ప్రేమ,
నీది భయంతో నిండిన మౌనమేమో!
ఆ భయం వీడి, బిడియం వదిలి,
నన్ను చేరి వస్తావని
ఇన్నాళ్లూ ఎదురుచూశాను నీకోసం!
నీ మనసు వెన్నలాంటి మృదువైనదని,
నీ గుండె మాత్రం రాయిలా మారిందని తెలిసినా,
నీవే నా తోడని, నీతోనే నా జీవితమని
నా మదికే మాటిచ్చాను.
కానీ, ఈ యువరాజు మొర ఆలకించని
ఆ అలివేణిని చేరగలనా?
చేరగలనా? చేరగలనా?
పోనీ, చేరేదెలా?
తన మనసులోని భావాలకు అక్షరరూపమిచ్చుకుంటూ, గీతిక ఆలోచనల్లోనే మునిగిపోయిన ప్రభ బైక్ నడుపుతూ దాదాపు పట్టణాన్ని దాటేశాడు. ఎప్పుడో పల్లెటూరికి వెళ్లే రహదారిపైకి చేరుకున్నాడు.
అయితే, అతని చూపులు రోడ్డుపైనే ఉన్నా, మనసు మాత్రం గీతిక జ్ఞాపకాల చుట్టూ పరిభ్రమిస్తోంది. అన్ని ఆలోచనలతో మనస్సు పరిభ్రమించిన" ఇక గీతిక గురించి ఆలోచనలకు కాస్త దూరంగా ఉండాలి నా భవిష్యత్తుపై శ్రద్ధ చూపాలి "అనుకుని బండి నీ నడుపుతుండగా
అదే సమయంలో, ఎదురుగా ఒక కారు వేగంగా దూసుకొచ్చింది.
ప్రభ తనవైపు వస్తున్న కారును గమనించేలోపే, అది రాంగ్ రూట్లోకి వచ్చేసింది. ఒక్కసారిగా అప్రమత్తమై బైక్ను పక్కకు తిప్పేందుకు ప్రయత్నించాడు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది.
ధడేల్! అంటూ కారు బలంగా బైక్ను ఢీకొట్టింది.
ఆ దెబ్బకు ప్రభ గాల్లోకి ఎగిరి రోడ్డుపై బలంగా పడిపోయాడు. వేగంగా దొర్లుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న రాయికి తల తగలడంతో, తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో పడిపోయాడు.
రక్తం నెమ్మదిగా రోడ్డుపైకి ప్రవహిస్తోంది. కాసేపటి క్రితం ప్రేమ ఆలోచనలతో నిండిపోయిన అతని కళ్లలో ఇప్పుడు చీకటి అలుముకుంది.
కారులో నుంచి బయటకు వచ్చిన మేనేజర్ ప్రభ వైపు నిర్లక్ష్యంగా చూశాడు.
“వీడు ఇక బతికేలా లేడులే! పదండి!” అంటూ కారులోని వాళ్లను తొందరపెట్టాడు.
ఆ తర్వాత, తనకు తాను ఏదో గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అంతా క్షణాల్లో జరిగిపోయింది.
***
ప్రకృతి ఒడిలో కొలువుదీరిన ఆ ఆయుర్వేద ఆసుపత్రి ఓ అందమైన ఆశ్రమాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పూలమొక్కలు, సువాసనలు వెదజల్లే ఔషధ మూలికలు... ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ప్రశాంతతను అందిస్తోంది. పక్షుల కిలకిలరావాలు, పిల్లగాలుల సవ్వడితో ఆ ప్రదేశమంతా ఓ ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకుంది.
అక్కడున్న ఓ చిన్న పర్ణశాల కింద చెక్క మంచంపై స్పృహలేకుండా పడి ఉన్నాడు ప్రభ.
అతను మెల్లగా కళ్ళు తెరవడం గమనించిన మాలిని వెంటనే డాక్టర్ మైథిలి దగ్గరకు వెళ్లి,
“మేడమ్! మంచం మీద ఉన్న ఆయన కళ్ళు తెరిచారు!” అని చెప్పింది.
ఆ మాట వినగానే మైథిలి చిరునవ్వుతో పర్ణశాల దగ్గరకు వచ్చింది.
మెల్లగా కనురెప్పలు తెరిచిన ప్రభకు మొదట ఏమీ స్పష్టంగా కనిపించలేదు. చూపు స్థిరపడిన తర్వాత ఎదురుగా నిలుచున్న డాక్టర్ మైధిలి ని చూస్తాడు..
తెల్లని దుస్తుల్లో, నుదుటిపై చిన్న బొట్టుతో, సహజమైన అందానికి చిరునవ్వును అలంకారంగా ధరించిన ఆమెను చూస్తుంటే, దేవుడు తీరికగా చెక్కిన గాజుబొమ్మలా అనిపించింది. ఆమె కళ్ళలో ప్రశాంతత, ముఖంలో హుందాతనం, చిరునవ్వులో ఆప్యాయత నిజంగా ఒక వైద్యురాలికి ఉన్న లక్షణాలు తనలో కనిపిస్తుంటే క్షణకాలం అతడిని మంత్రముగ్ధుడిని చేశాయి.
“హలో! నా మాటలు వినిపిస్తున్నాయా? ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందిగా ఉందా?” అంటూ మైథిలి చిరునవ్వుతో అడిగింది.
ఆమె మాటలకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభ, ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.
“మిస్టర్! నేను అడుగుతున్నది మిమ్మల్నే!” అంటూ ఆమె నవ్వుతూ మరోసారి అడిగింది.
“ఆ... ఆ... ఏమీ లేదండి!” అంటూ తేరుకుని సమాధానమిచ్చాడు ప్రభ.
“మంచిది! మీకు స్పృహ వచ్చింది. కానీ, ఇంకా విశ్రాంతి అవసరం. కంగారుపడకండి. త్వరలోనే కోలుకుంటారు” అంటూ ధైర్యం చెప్పింది మైథిలి.
“థాంక్యూ, డాక్టర్!” అన్నాడు ప్రభ చిరునవ్వుతో.
“యు ఆర్ వెల్కమ్!” అంటూ నాన్న గంగాధర్ పిలవడంతో ఆమె అక్కడి నుంచి వెళుతుంది.