మైథిలితో మాట్లాడిన అనంతరం గంగాధర్ రావడాన్ని గమనించిన ప్రభ అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే గంగాధర్ చూపులు అతడిని అనుకోకుండా తనవైపు ఆకర్షించాయి. ఆయన కళ్లలో ఏదో ప్రత్యేకమైన కాంతి కనిపిస్తోంది. ఆ చూపుల్లో తెలియని ఆత్మీయత, ఆప్యాయత తొణికిసలాడుతున్నాయి.
గంగాధర్ నడుచుకుంటూ వస్తున్న తీరును గమనిస్తుంటే, ఎప్పటినుంచో పరిచయమున్న ఆత్మీయుడిని పలకరించడానికి వస్తున్నట్లుగా అనిపించింది. ఆయన అడుగులు ప్రభకు చేరువయ్యే కొద్దీ ఆ ఆప్యాయత మరింత స్పష్టమైంది.
దగ్గరకు వచ్చిన గంగాధర్ చిరునవ్వుతో రెండు చేతులూ చాపారు. ఏదో అనుకున్నట్లుగా ఒక్క క్షణం ఆగి, చేతులను కిందికి దించి ప్రభ భుజంపై ఆప్యాయంగా చేయి వేశారు.
ఆ స్పర్శలోని ఆత్మీయత ప్రభకు కూడా తెలియకుండానే మనసును తాకింది.
"ప్రభా! నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా..." అంటూ ఏదో చెప్పబోయారు. ఇంతలో ఆయన భార్య అక్కడికి రావడంతో ఒక్కసారిగా మాటను ఆపేశారు. తన చేతిని ప్రభ భుజం మీద నుంచి తీసి,
"బాబూ! ఇదిగో..." అంటూ చేతిలోని చిన్న సంచిని అతడికి అందించారు.
అదేంటన్నట్లు చూస్తున్న ప్రభను గమనించిన గంగాధర్ భార్య,
"తీసుకో బాబూ!" అని ఆప్యాయంగా చెప్పడంతో ప్రభ ఆ సంచిని అందుకున్నాడు.
"వెళ్లొస్తానండి. . అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది" అంటూ ప్రభ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.
"అమ్మని అడిగినట్టు..." అంటూ గంగాధర్ ఏదో చెప్పబోయి, మధ్యలోనే మాటను ఆపేశారు. ఆయన మనసులోని భావం మాటగా బయటకు రాకుండానే ఆగిపోయింది.
చేతిలోని చిన్న సంచిని చూస్తూ, అందులో ఏమున్నాయోనని ఆలోచిస్తున్న ప్రభ దగ్గరకు మైత్రిలి కూడా వచ్చింది.
అందరినీ ఒకసారి చూస్తూ, "వెళ్లొస్తానండి" అని చెప్పిన ప్రభ, చివరిగా గంగాధర్ వైపు చూశాడు. ఆయన కళ్లలో కనిపించిన ఆప్యాయతను, కాసేపటి క్రితం తన భుజంపై వేసిన చేయిలోని ఆత్మీయ స్పర్శను మరోసారి గుర్తు చేసుకున్నాడు.ఏదో తెలియని అనుబంధం తనను తాకిన అనుభూతితో అక్కడి నుంచి బయలుదేరాడు.
***
కొడుకు వెళ్లి రెండు రోజులైనా కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకపోవడంతో గౌరీ ఎదురుచూపులు మరింత పెరిగాయి. అలాంటి సమయంలో ఇంటి గుమ్మం ముందు ప్రభ కనిపించగానే ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
"నాన్నా! నాన్నా! రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్లావు? కనీసం ఒక మాటైనా చెప్పి వెళ్లొచ్చు కదా!" అంటూ ప్రేమతో కూడిన ఆవేదనను వ్యక్తం చేసింది.
తల్లి ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానమిస్తూ,
"అమ్మా! ఒక ముఖ్యమైన పని ఉండి వెళ్లాను. వచ్చేశానుగా! ఇక కంగారుపడకు" అంటూ లోపలికి నడిచాడు.
కొడుకు తనతో పంచుకోలేనంత ముఖ్యమైన పని ఏముంటుందోనని గౌరీ మనసులో అనుకుంది. అయితే అప్పుడే అడిగి అతడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా లోపలికి వెళ్లిపోయింది.
ప్రభ తన చేతిలోని చిన్న సంచిని టేబుల్‌పై ఉంచి, గదిలోకి వెళ్లి తిరిగి బయటకు వచ్చాడు.
భోజనం సిద్ధంగా ఉంది ముందు అన్నం తినరా ! గౌరీ పిలవడంతో
. నేను తినే వచ్చాను. నువ్వు మాత్రం తప్పకుండా ఎదురుచూస్తూ తినకుండా ఉంటావని నాకు తెలుసు
ముందు నువ్వు భోజనం చేయమ్మా!" అంటూ తల్లి పక్కనే కూర్చున్నాడు.
కొడుకు మాట కాదనలేక గౌరీ భోజనం చేసింది. ఆమె తిన్న తర్వాత,
"అమ్మా! నేను డైరీ హోమ్‌కి వెళ్లొస్తాను" అని చెప్పి ప్రభ బయటకు వెళ్లిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత టేబుల్‌పై ఉన్న చిన్న సంచిని తీసి చూసిన గౌరీకి అందులో రెండు చీరలు కనిపించాయి. అవి కూడా తనకు ఎంతో ఇష్టమైన రంగుల్లో ఉండటంతో ఆశ్చర్యంగా వాటిని బయటకు తీసింది.
"ఇదేంటి? వీడు ఎక్కడికి వెళ్లి వచ్చాడో... చీరలు కూడా తీసుకొచ్చాడు!" అంటూ ఒక చీరను చేతుల్లోకి తీసుకుంది.
చీర అంచుల్లోని అందమైన డిజైన్, అల్లికను చూడగానే ఆమె చూపులు ఒక్కసారిగా అక్కడే నిలిచిపోయాయి. ఆ అల్లికలో ఏదో పరిచయమైన స్పర్శ కనిపించింది. మరోసారి నిశితంగా పరిశీలించింది.
"అరే! ఇది... ఇది అన్నయ్య నేసిన చీర కదా!"
ఆమెకు ఆ అల్లిక గురించి బాగా తెలుసు. ఎన్నేళ్లు గడిచినా తన అన్నయ్య చేతి పనిని గుర్తుపట్టలేనంతగా ఆ జ్ఞాపకం చెరిగిపోలేదు.
అన్నయ్య గంగాధర్ గుర్తుకు రాగానే గౌరీ కళ్లలో నీళ్లు తిరిగాయి. చీరను గుండెలకు హత్తుకుని కొద్దిసేపు అలాగే ఉండిపోయింది.
ఇదిలా ఉండగా, ఏదో మరిచిపోయానన్న ఆలోచనతో ప్రభ తిరిగి ఇంట్లోకి వచ్చాడు. హాల్లోకి అడుగుపెట్టగానే చీరను చేతిలో పట్టుకుని వాటిని తదేకంగా చూస్తూ ఉంటె కంటితడి స్పష్టంగా కనిపించింది.
'అమ్మ ఏంటి? చీరను చూసి అంతలా భావోద్వేగానికి గురవుతోంది? ఈ చీరతో అమ్మకు ఏదైనా ప్రత్యేకమైన అనుబంధం ఉందా?'
అతడి ఆలోచనలు ఒక్కసారిగా గంగాధర్ వైపు మళ్లాయి.
'ఆయన నన్ను చూసిన విధానం కూడా చాలా విచిత్రంగా ఉంది. ఏదో ఎన్నాళ్ల నుంచో పరిచయమున్న వ్యక్తిని చూసినట్లు అంత ఆప్యాయంగా పలకరించారు. పైగా ఈ చీరలు కూడా ఆయనే ఇచ్చారు. గంగాధర్ గారికి, అమ్మకు ఏదైనా పరిచయం ఉందా? బహుశా చీరలు నేసే వ్యాపారం కాబట్టి ఇచ్చి ఉంటారేమో! కానీ ఈ చీరను చూసి అమ్మ ఎందుకింతగా కదిలిపోతోంది?'
తల్లిని అడిగి విషయం తెలుసుకోవాలని ఒక అడుగు ముందుకు వేశాడు. కానీ అప్పటికే డైరీ హోమ్‌కు వెళ్లాల్సిన పని గుర్తుకు రావడంతో, ప్రస్తుతానికి తన సందేహాన్ని మనసులోనే దాచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ప్రభ వెళ్లిపోయిన తర్వాత గౌరీ మరోసారి ఆ చీరను చేతులతో నెమ్మదిగా తడుముకుంది.
"అన్నయ్యా! .. ఈ చీరల్ని నువ్వే నేసావని నాకు తెలుసు . అసలు నువ్వెక్కడున్నావ్ ? ప్రభ నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? బహుశా ప్రభ నా కొడుకు అని నీకు తెలుసా ?ఎలా తెలుసుకున్నావు ? లేదా వాడు మీకు ఏదైనా ఉపకారం చేశాడా అందుకోసమేమైనా ఇచ్చావా ? ఇది ఏమైనా ఇన్నాళ్ళకి నా అన్నయ్య ఉన్నాడని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది . చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లం మనం! పెద్దవాళ్లయిన తర్వాత చిన్న పొలం విషయంలో వచ్చిన మనస్పర్థలు ఇన్నేళ్ల పాటు మనల్ని దూరం చేస్తాయని అనుకున్నామా? ఒక్కసారి కనిపించరా అన్నయ్యా!" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
పుట్టింటి అనుబంధం ఎంత గొప్పదో, ఆ ఇంటి నుంచి వచ్చే చిన్న కానుకలోనూ ఎంతటి ఆప్యాయత దాగి ఉంటుందో ఆమెకు తెలుసు. ముఖ్యంగా గృహప్రవేశం వంటి శుభకార్యానికి పుట్టింటి నుంచి చీర రావాలనే కోరిక ప్రతి ఆడపిల్ల మనసులో ఉంటుంది.
తన గృహప్రవేశానికి పుట్టింటి చీర కావాలని ఎన్నిసార్లు మనసులో అనుకుందో! కానీ అన్నయ్యతో ఏర్పడిన దూరం కారణంగా ఆ కోరికను బయటకు చెప్పుకోలేకపోయింది.
"మొత్తానికి ఆ దేవుడే నా మనసులోని కోరికను తీర్చాడు. నా అన్నయ్య చేతుల మీదుగా నేసిన చీరే నా ఇంటికి వచ్చింది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను" అంటూ మరోసారి చీరను ఆప్యాయంగా నిమిరింది.
సంచిలో ఉన్న రెండో చీరను మాత్రం తెరవలేదు. అది కూడా తన అన్నయ్య చేతుల మీదుగా వచ్చిన కానుకే అన్న భావనతో దానిని జాగ్రత్తగా మడతపెట్టి, మొదటి చీరతో పాటు బీరువాలో భద్రంగా పెట్టింది.
'నా గృహప్రవేశానికి అన్నయ్యను తప్పకుండా పిలవాలి. ఇన్నేళ్ల దూరాన్ని ఇకనైనా చెరిపేయాలి. ఆ శుభకార్యానికైనా మా అన్నయ్య నా పక్కన ఉండాలి' అని మనసులో దృఢంగా నిర్ణయించుకుంది.
ఆమె కళ్లలో ఇంకా కన్నీటి తడి ఉన్నప్పటికీ, మనసులో మాత్రం ఎన్నాళ్లకో ఒక తియ్యని సంతోషం చోటుచేసుకుంది.
***
ఇంటి నుంచి బయలుదేరిన ప్రభకు అమ్మ చీరలు . చూస్తూ, సంతోషిస్తుందా? బాధపడుతుందా? అసలు నేను ?' అని ఆలోచిస్తూ డైరీ ఫామ్‌కు చేరుకున్నాడు.
ప్రభను చూడగానే పప్పు పరుగెత్తుకొచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు.
"ప్రభా!" నేను విన్నది నిజమేనా ?"అంటూ అతని భుజంపై తలవాల్చాడు.
అవునన్నట్టు తల ఊపుతాడు ప్రభ
అని చూసిన పప్పు ఇంకా బాధపడుతూ ప్రభ వైపు చూస్తాడు
ప్రభ పప్పు భుజాలను పట్టుకుని, " నిజాయితీ నిప్పులాంటిదిరా,. అది ఎప్పుడు తప్పును తరిమేస్థూ ఒప్పును మాత్రమే అంగీకరిస్తుంది .
"నువ్వు చెప్పేది నిజమే ప్రభా! ఆ మేనేజర్ నిన్ను చంపాలని చూసి తనే చనిపోయాడు. మన ఓనర్‌కు ఈ విషయం తెలియక, ప్రమాదంలో చనిపోయాడని అనుకున్నారు. నువ్వు రెండు రోజులపాటు తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లావని అడిగారు."
"అవునా? ఈ విషయం ఇక మాట్లాడకూడదు" అని ప్రభ చెప్పగానే మేనేజర్ అక్కడికి వచ్చాడు.
"మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. సారీ ప్రభ నిజం తెలియక నువ్వు రెండు రోజులు నాతో ఏ విషయం చెప్పకుండా అక్కడికి వెళ్లావు అనుకున్నాను అయినా ఒక మనిషిని నిర్ధాక్షణ్యంగా చంపాలనుకోవడం రాక్షసత్వం. అలా చేయడం ఎంతవరకు సమంజసం? నేను ప్రమాదంలో చనిపోయాడని వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చాను" అన్నాడు.
సరే ఓకే యజమానిగా మీరు చేసినది మంచి పని.
అది కాదు ప్రభ ఇలాగని తెలిసుంటే నేను వెళ్లే వాడిని కాదు
అలా అంటే ఎలా సార్ అతను ఐదు సంవత్సరాల పనిచేశాడు అతను డబ్బు కోసం అలా చేసి ఉంటాడు తను చేసిన తప్పు వల్ల ఇప్పుడు భార్య పిల్లలు కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది.
ఏ కష్టం
"సార్! అతనికి ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ల అమ్మ చూస్తే కాస్త అవిటి మనిషి. మీరు దయచేసి ఆ పిల్లవాడి చదువుకు సహాయం చేయండి" అని అడిగాడు.
"నిజంగా నీకు చాలా పెద్ద మనసురా! తప్పకుండా ఆ పిల్లవాడిని చదివిస్తాను" అని యజమాని హామీ ఇచ్చాడు.
ఆ మాటలకు ప్రభ ఆనందించాడు.
"ఇకనుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ భవిష్యత్తుకు ఆటంకాలు రాకుండా, నువ్వు నీ ఆశయాన్ని సాధించాలని మీ అమ్మ ఎంతో కష్టపడుతోంది. ఆమె కష్టానికి తగిన ఫలితం నువ్వు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను" అన్నాడు యజమాని.
ఆ మాటలు విన్న ప్రభ మనసులో, 'ఇలాంటి యజమానిని నేను ఎప్పుడూ చూడలేదు. నా ఆశయాన్ని గుర్తించి, నిస్వార్థంగా ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఈయన మాటలకు ఎంత గౌరవం ఇవ్వాలి!' అని అనుకున్నాడు.
పప్పు వైపు తిరిగి చిరునవ్వుతో, "ఇకనుంచి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మన ఆశయాన్ని సాధించాలి" అన్నాడు.
మధ్యాహ్నం మూడు గంటల సమయం.
డైరీ ఫామ్‌లో పనివాళ్లకు అవసరమైన సూచనలు ఇస్తూ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు ప్రభ. ఇంతలో అతని మొబైల్ మోగడంతో చేతిలోని పనిని ఆపి ఫోన్ తీశాడు.
అవతల నుంచి చరిత గొంతు వినిపించింది.
"హలో!"
"అక్కా, చెప్పు."
"ఏంట్రా చెప్పేది? నువ్వు పనిలో ఉండి మెసేజ్‌లు చూసుకుంటున్నావా లేదా?"
"ఏ మెసేజ్ అక్కా?"
"ఒకసారి మొబైల్ తీసి చూడరా!"
"అలాగే అక్కా."అంటూ ఫోన్ పెట్టేసిన ప్రభ, అక్కడున్న పనివాళ్లకు కొన్ని సూచనలు ఇచ్చి బయటకు వచ్చాడు. ఆ తర్వాత
మొబైల్లో వచ్చిన మెసేజ్‌లు పరిశీలించగా, అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరీక్షల ఫలితాలు వచ్చేశాయి!
ఆత్రంగా రిజల్ట్స్ లింక్ ఓపెన్ చేసి తన ర్యాంక్ కోసం వెతికాడు. కొద్దిసేపటికే తన పేరు కనిపించింది.
కట్ ఆఫ్ మార్క్స్ పరిశీలించిన ప్రభా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తనకంటే ముందున్న అభ్యర్థి కేవలం ఒక్క మార్కు తోనే కట్ఆఫ్ మార్కులను అధిగమించి ఉండటం చూసి, అతని గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది. తన ఆశలన్నీ ఒక్క మార్కు తేడాతో దూరమైనట్లుగా అనిపించింది.
అంతే! ప్రభ మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది.
"ఇదేంటి దేవుడా! ఇన్నాళ్లూ ఇంత కష్టపడి చదివింది ఇందుకోసమేనా?
కష్టానికి తగిన ఫలితం తప్పకుండా దక్కుతుందని ఇన్నాళ్లూ నమ్మాను. కానీ, ఇప్పుడు ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఒక్క మార్కు తేడాతో అవకాశం చేజారిపోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు అమ్మకు ఏమని చెప్పాలి? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మకు ఈ విషయం ఎలా చెప్పగలను?
కోర్సు పూర్తయిన తర్వాత బైక్ రేసింగ్‌కు వెళ్లి తప్పు చేశాను. ఆ సమయంలో చదువుపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే, ఈ రోజు పరిస్థితి మరోలా ఉండేదేమో! విలువైన సమయాన్ని వృథా చేసుకున్నానన్న బాధ నన్ను వెంటాడుతోంది.
అతని కళ్లముందు అమ్మ రూపం కదలాడింది.
తన కోసం ఆమె పడిన కష్టం, తన చదువు కోసం ఆమె చేసిన త్యాగాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి.
"ఒక్కసారి కష్టపడి సాధించిన విజయం జీవితాంతం మనకు తోడుగా ఉంటుంది " అన్న అమ్మ చెప్పిన ఆ మాటల్లోని నిజాన్ని ఇంత ఆలస్యంగా అర్థం చేసుకున్నానని ప్రభా తనలో తానే బాధపడ్డాడు.
ప్రతి ఆలోచన అతని మనసును మరింత కలవరపెడుతోంది.
తన కష్టానికి ఫలితం దక్కుతుందన్న ఆశ ఒకవైపు ఊహగా మాత్రమే మిగిలిన ... ఉద్యోగం చేజారిపోతుందేమోనన్న భయం మాత్రం ఖాయం అని మరోవైపు.
ఆ రెండు భావాల మధ్య నలిగిపోతూ ప్రభ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు.
తన భవిష్యత్తు కళ్లముందే మసకబారిపోతున్నట్లు అనిపించింది.