What is my mistake? - 2 in Telugu Thriller by Lakshmi Prasanna books and stories PDF | నా తప్పు ఏంటి? - 2

Featured Books
Categories
Share

నా తప్పు ఏంటి? - 2

2

“పిన్నీ….” అంటూ గోల చేస్తూ పరిగెత్తుతూ వచ్చారు శృతి వాళ్ల అక్క సంజన పిల్లలు…

“హే! మీరు ఎప్పుడు వచ్చారు?” లోపలికి వస్తూ వాళ్లని ఎత్తుకుంటూ అడిగింది…

“నిన్న నైట్ వచ్చాం… మాకు పొంగల్ హాలిడేస్ ఇచ్చారు… 10 డేస్ ఇక్కడే ఉంటాం…” చాలా ఆనందంగా చెప్పారు…

వాళ్ల అమాయకపు మాటలకి నవ్వుకుంది శృతి… బుగ్గన ఒక ముద్దు ఇస్తూ…

“అక్కా…” అంటూ చిన్నపిల్లలా వెళ్లి సంజనని హత్తుకుంది శృతి…

“ఏంటే ఇది… రేపు పండగ అంటే ఈరోజు వస్తావా… కాస్త ముందు రావొచ్చుగా?” కొంచెం కోపం, కొంచెం ప్రేమతో అడిగింది సంజన…

“రావాలనే అనుకున్నా… కానీ కొంచెం ఇంపార్టెంట్ టాస్క్స్ వల్ల కుదరలేదు అక్కా… అయినా లేట్‌గా వచ్చా కాబట్టి లేట్‌గా వెళ్తాలే…” చంటితనం, చిలిపితనం కలిపి చెప్పింది కళ్లుచిన్నవి చేస్తూ, తల ఆడిస్తూ…

“సరేలే… కబుర్లు తర్వాత కానీ… వెళ్లి స్నానం చెయ్యి…” టవల్ చేతికిస్తూ కాస్త విసుగ్గా చెప్పింది అమ్మ…

‘లేట్‌గా వచ్చా అని కోపం వచ్చిందా…. సారీ…’ అని చెంపపై ఒక ముద్దు పెట్టి పరిగెత్తింది…

కూతురి అల్లరి చూస్తూ… ముసిముసిగా నవ్వుకుంటుంది ఆ అమ్మ…

***

నేల కనిపించకుండా దట్టంగా కప్పేస్తున్న మంచు పొరలని భోగి మంటలు వెనక్కి నెట్టేస్తున్నాయి… వెచ్చగా చలి కాచుకుంటూ అమ్మ చేసే పులిహోర, గారెలు ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నారు పిల్లలు… పొద్దున్నే ఎందుకు లేచారో తెలియక…

“శృతి… చిన్నపిల్లలు కూడా ఐదుకి లేచి రెడీ అయిపోయారు, నువ్వు మాత్రం ఆరు అవుతున్నా ఇంకా పడుకున్నావు… మర్యాదగా లేస్తావా లేక నీళ్లు పోసేయనా…” కోపంగా అరిచింది సంజన…

“ప్చ్…” ఒక చిన్న శబ్దం చేసింది…

‘ఈ అరుపులకంటే నా అలారమే బెటర్…’ అనుకుంటుంది నిద్రలో…

“లేస్తున్నావా లేదా?”

“లేస్తున్నా… ఆగవే బాబూ… నువ్వు అమ్మ అయ్యాక అమ్మలానే తయారయ్యావు…” నిద్రలో ఆవలింతలు తీస్తూ, మెల్లగా లేచింది…

పండగ కోసం కొనుకున్న కొత్త పట్టు లంగావోణీ వేసుకుని తయారు అయ్యింది…

ముదుర ఆకుపచ్చ రంగు లంగా… మ్యాచింగ్ జాకెట్… రాణి రంగు వోణీ… మీదకు చిన్న నెక్లెస్… చేతులకి మందపాటి గాజులు… కాళ్లకి ఘల్లు మనే పట్టీలు… చూడడానికి పదహారేళ్ల తెలుగు ఇంటి అమ్మాయిలా తయారయ్యింది శృతి…

అద్దంలో మళ్లీ మళ్లీ అటూ ఇటూ తిరుగుతూ తనని చూసుకుని మురిసిపోతుంది…

“అద్దంలో చూసుకుని మురిసిపోవడం అయిపోతే… కాస్త వెళ్లి పూజ గదిలో అన్నీ సర్దవే…” వంటింట్లో గారెలు వేస్తూ చెప్పింది అమ్మ…

“సరే…” మరోసారి అద్దంలో చూసుకుని, తలలో పువ్వులు సర్దుకుని వెళ్లింది…

“పిన్నీ… పిన్నీ… బయట అమ్మమ్మ వేసిన ముగ్గు చాలా బాగుంది… కానీ దాని పైన కౌ డంగ్ ఎందుకు పెట్టారు…” దేవుడి పటాలకు పువ్వులు పెడుతున్న శృతిని అడిగాడు అయాన్ష్…

వాడి మాటలు విని ఇంట్లో అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు…

అంతా కలిసి పూజ చేసి, టిఫిన్ తినేసరికి దాదాపు భోజనం టైమ్ అయింది…

అరిటాకు అంతా పిండివంటలతో నింపేసింది అమ్మ…

***

‘భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతీ...’

పాటలు మారుమోగుతుంటే… పిల్లలతో కలిసి సరదాగా డాన్స్ చేస్తుంది శృతి…

“దానికి నువ్వైనా చెప్పవే… దానికంటే చిన్నవాళ్లకి కూడా పెళ్లిళ్లు అయిపోతున్నాయి కానీ ఇది మాత్రం చేసుకోనంటుంది…” హాల్‌లో నుంచి అమ్మ మాటలు వినిపించాయి…

‘మళ్లీ మొదలు పెట్టారా… వీళ్లకి ఎలా చెప్తే అర్థం అవుతుందో ఏంటో…’ అనుకుంటుంది మనసులో…

‘నేను మాట్లాడతాలే అమ్మ… నువ్వేం కంగారు పడకు…’ సంజన అమ్మకి నచ్చజెప్పుతుంది…

***

మరుసటి రోజు ఉదయాన్నే లేచి తయారయ్యేసరికి… సంక్రాంతి బసవన్న ఇంటి ముందు ఆడుతున్నాడు…

వీధిలోకి వెళ్లి చూస్తే… వీధి నిండా అందమైన ముగ్గులు… వాటి పైన రంగుల పువ్వులతో పెట్టిన గొబ్బెమ్మలు… సాంప్రదాయ బట్టలలో పిల్లలు, పెద్దలు… చూడముచ్చటగా ఉన్నాయి…

పూజలు అయిపోయాక… వీధిలో వారంతా ఒక ఖాళీ స్థలంలో చేరి ఆటలు, పాటలతో సాయంత్రం వరకు సరదాగా గడిపేశారు…

“శృతి… నీతో కొంచెం మాట్లాడాలి…” మెడపైన ఏదో ఆఫీస్ వర్క్ చేస్తుంటే వెనక నుంచి వచ్చి అడిగింది సంజన…

“పెళ్లి గురించి అయితే మాట్లాడకు…” చెప్పేసింది మొహమాటం లేకుండా…

“అది కాదే… అమ్మ, నాన్న గురించి ఆలోచించు... నీకు 27 ఏళ్లు వచ్చినా పెళ్లి చేయలేదు అని అందరూ నానారకాలుగా మాట్లాడుతున్నారు…”

‘మౌనంగా ఆలోచనలో పడింది…’

“అయినా ఎంత కాలం ఇలా ఉంటావు… నీకు అంటూ ఒక తోడు కావాలి కదా… నిన్ను జాగ్రత్తగా చూసుకునే మనిషి ఉండాలి కదా?” అడిగింది…

‘విసుగ్గా ల్యాప్‌టాప్ మూసేసి… “బావా…” అంటూ కిందకి వెళ్లిపోయింది.’

***

‘ఈ నక్షత్రాలు అన్నీ చంద్రుడి చుట్టూ రింగులా ఉంటే చందమామ మరింత అందంగా ఉంటుందేమో కదా…’ మేడ పైన ఓ పట్టి మంచం మీద పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఆలోచిస్తుంది…

“దాని కాళ్ల మీద అది నిలబడితే చూడాలి అనుకున్నాం కానీ… ఇలా ఒంటరిగా మిగిలిపోతా అంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు అండి…” పెరట్లో నాన్నతో మాట్లాడుతున్న అమ్మ మాటలు వినిపిస్తున్నాయి…

“దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టి… నా కూతురికి ఆ కష్టం వచ్చినా, కన్నీరు తుడిచే ఒక చెయ్యి ఉంది లే అని ధైర్యంగా కన్ను మూయాలి అని ఉంది…” అంటున్నాడు నాన్న…


‘కన్నీరు తుడవడానికి…’

… ఒక్క క్షణం ఆలోచనలో పడింది…

‘నా కన్నీరు తుడవడానికి…’

... 

“నా చెయ్యి సరిపోదా?”… ఆలోచనలో పడింది…


“చుక్కలు ఎన్ని ఉన్నాయి ఏంటి…” ఒక గొంతు వెటకారంగా వినిపించింది…

“మీరే లెక్కపెట్టండి బావగారు…” ఇంకా వెటకారంగా బదులిస్తూ లేచి కూర్చుంది…

“ఎవరు అతను?” అడిగాడు చుక్కలు చూస్తూ…

“ఎవరు బావ?” అయోమయంగా అడిగింది…

“నా దగ్గర ఎందుకు దాయటం… పెళ్లి అంటే ఎంతో ఎక్సైట్ అవ్వాల్సిన ఏజ్‌లో ఇంత వ్యతిరేకంగా ఉన్నావు అంటే… ఏదో లవ్ ఫెయిల్యూర్ ఉంది అని అర్థం అవుతుంది లే… చెప్పు ఏంటి ఆ కథ…” తన వైపు చూస్తూ ఒక స్నేహితుడిలా అడిగాడు…

“అదేం లేదు బావ…”

“ఏమీ లేకపోతే ఇలా పెళ్లి వద్దు అనే కంక్లూజన్‌కి ఎందుకు వచ్చావు మరదలు పిల్లా?” ఆటపట్టిస్తున్నట్టుగా అడిగాడు…

“అది కంక్లూజన్‌ కాదు బావగారు… రియలైజేషన్…” కాన్ఫిడెంట్‌గా చెప్పింది…

“అవునా… కాస్త ఆ రియలైజేషన్‌ని మాకు కూడా బోధించొచ్చుగా…”

“గోతిలో పడ్డ నక్కకి బోధనలు కాదు… చెయ్యి అందించాలి ఏమో…?”

‘తల కాస్త వంచి కిందకి చూస్తున్నాడు...’

“సరే… సరే… డిన్నర్ చేద్దామా…” లేచి వెళ్తూ అంది…

‘ఆగవే…’ అంటూ మెట్లకు అడ్డుపడింది అప్పుడే పైకి వస్తున్న సంజన…

“ఏంటే బాబు…” విసుగ్గా అడిగింది

“ఈరోజు తెలియాలి అంతే… మర్యాదగా పెళ్లి ఎందుకు వద్దు అంటున్నావో చెప్పు…” ఖచ్చితంగా అడిగింది…

“శృతి… మేము నీ మంచి కోరుతామే కానీ, చెడు కాదు… కనీసం కారణం ఏంటో తెలిస్తే ఒక పరిష్కారం వెతకొచ్చు కదా… చెప్పు అమ్మ…” చంటి పిల్లని అడిగే నాన్నలా గడ్డం పట్టుకుని అడిగాడు…

‘శృతి కళ్లలో నీరు… చుక్కలని చూస్తున్నట్టుగా వెనక్కి పంపేస్తుంది…’


“ప్రాబ్లమ్ ఏం లేదు బావ… నాకు ఈ బంధాల మీద నమ్మకం లేదు… పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా అమ్మాయి కనిపిస్తే సొల్లు కార్చే వాళ్లని రోజూ చూస్తూనే ఉన్నాను… మా ఆఫీస్‌లో నా వెంట పడతారు కొందరు… పెళ్లి అనే బంధం నిజం అయితే… మగాడికి మరో ఆడదాని మీద ఆశ ఎందుకు పుడుతుంది…” తన మనసులో ప్రశ్నని నిలదీసినట్టుగా అడిగి కిందకి వెళ్లిపోయింది…

“ఏంటి అండి… ఇలా అంటుంది…”

“చుట్టూ ఉన్నవాళ్లని మరీ ఎక్కువ గమనిస్తే వచ్చే ప్రమాదం ఇదే సంజూ… తన ప్రశ్నకి సమాధానం ఇచ్చేవాడు… తన భయాన్ని అబద్ధం చేసేవాడు ఒకరోజు వస్తాడు…”

ఇద్దరూ కిందకి వెళ్లిపోయారు…

***

“శృతి… నువ్వు మరో ఆడదాని మీద ఆశపడే మగాళ్లని చూసి పెళ్లి వద్దు అంటున్నావు… కానీ చివరి వరకు ఒక్కరినే ప్రేమించే మగాళ్ల గురించి మర్చిపోతున్నావు…” రూమ్‌లో పక్కన పడుకున్న శృతి తల నిమురుతూ చెప్తుంది…

‘ఆలోచనలో పడింది శృతి...’

“ఏ విషయాన్ని ఒకటే కోణంలో చూడొద్దు అని నువ్వే చెప్తావుగా… మరి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు?”

... 

“నీ భయంలో నిజం ఉంది… కానీ నువ్వు చూడని నిజం మరొకటి ఉంది… ఆలోచించు…” అని చెప్పి నిద్రపోయింది…

‘శృతికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు.’

‘అక్క అన్నది కూడా తప్పు కాదు… చాలా మంది నిజంగా ప్రేమించే వాళ్లు కూడా ఉన్నారుగా…’

‘ఆ నిజమైన ప్రేమ బయటకు కనిపించే నాటకం ఏమో…’

‘కానీ నాన్న మాట కూడా న్యాయమే కదా… నీకు అంటూ ఒక తోడు ఉంది అనే ధైర్యం వాళ్లకి కావాలి కదా…’

‘ఆ తోడు నాకు నేనే కాలేనా…’

తనలో తానే వాదించుకుంటుంది…

*****

"శృతి ఆలోచనలో ఉన్న నిజం ఈ సమాజం ఒప్పుకుంటుందా?"