ప్రభ మీదకు చేయి ఎత్తబోయిన నారాయణను గుణేష్ అడ్డుకుని, ప్రభ చదువు, అతని వ్యక్తిత్వం గురించి వివరంగా చెప్పాడు. అయినప్పటికీ నారాయణ మనసులోని అసంతృప్తి పూర్తిగా తొలగిపోలేదు. చివరకు గుణేష్ ప్రభను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లిపోయాడు.
వాళ్లు వెళ్లిపోయాక నారాయణను చూస్తూ గీతిక మనసులో ఆవేదన ఉప్పొంగింది.
‘మా నాన్న కాలర్ పట్టుకునేంత ధైర్యమా వాడికి? పెద్దవాళ్లని కూడా గౌరవించకుండా అంత అహంకారమా?’ అని మనసులోనే రగిలిపోయింది. ఆ అసహనం మాటల రూపంలో బయటపడుతుండగానే, దేవి వస్తున్న అలికిడి వినిపించింది.
“బుజ్జీ! జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు దీని గురించి ఎక్కువగా మాట్లాడకు. మీ అమ్మకు తెలిస్తే లేనిపోని సమస్యలు మొదలవుతాయి. ఇప్పటికే నీ మనసు ఎన్నో బాధలతో నిండిపోయింది. నా మాట విని లోపలికి వెళ్లు” అని నారాయణ నచ్చజెప్పడంతో గీతిక మౌనంగా లోపలికి వెళ్లిపోయింది.
దేవి ఇంట్లోకి వచ్చిన తర్వాత నారాయణ ఏమీ తెలియనట్టు తన గదిలోకి వెళ్లిపోయాడు. జరిగిన విషయం ఆమెకు తెలిస్తే గీతికకు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని భావించి, ఆ సంఘటన గురించి ప్రస్తావించకుండా ఉండిపోయాడు.
***
గుణేష్ ఇంటికి చేరుకున్న వెంటనే, “చరితా! చరితా!” అంటూ గట్టిగా పిలిచాడు.
ఆ పిలుపు విని హాల్లోకి వచ్చిన చరిత, “ఏమండీ! ఎందుకలా గట్టిగా అరుస్తున్నారు? బాబు పడుకున్నాడు. కాస్త మెల్లగా మాట్లాడండి” అంది.
“నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదు” అన్నాడు గుణేష్ అసహనంగా ముఖం పెట్టి.
“నేను చేసిన పనేంటి? నాకేమీ అర్థం కావడం లేదు. కాస్త వివరంగా చెబితే తెలుస్తుంది కదా!” అంది చరిత అయోమయంగా.
“ప్రభను తెలిసి తెలిసి నారాయణ వాళ్లింటికి ఎందుకు పంపించావు? నేను అక్కడికి వెళ్లేసరికి మాటలతో మొదలైన గొడవ చేతులెత్తే పరిస్థితికి చేరుకుంది. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే పరిస్థితి ఏమయ్యేది?” అన్నాడు గుణేష్ ఆందోళనగా.
“అలా జరుగుతుందని నేను అంత దూరం ఆలోచించలేకపోయానండీ. ఇంతకుముందే వచ్చే బాబుని చూసి వెళ్ళాడు ఆ విషయం మీకు తెలియదు కదా . పాపం ఈసారి గీతిక కోసమే తను ఎలా ఉందో అన్న ఆలోచనతోనే వచ్చాడని నేను అనుకుని అలా చేశాను.అయినా, అంకుల్ ప్రభతో అలా ప్రవర్తించడం బాగుందా? కూతురంటే ఎంత ప్రేమ ఉన్నా, ఇంకొకరిని అవమానించే హక్కు ఆయనకు ఉందా?” అంది చరిత.
“అది నిజమే! కానీ ఒక తండ్రిగా తన కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పెలా అవుతుంది? చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని మంచి అబ్బాయి చేతిలో పెట్టాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోరు? ఎవరి స్థాయిని బట్టి వాళ్లు ఆలోచిస్తారు. ఇందులో నారాయణ తప్పు లేదనుకున్నా, ప్రభను అతని స్థాయిని తక్కువ చేస్తూ నానామాటలు అనడం మాత్రం నాకు నచ్చలేదు” అన్నాడు గుణేష్.
“పోనీలెండి! జరిగిందేదో జరిగిపోయింది. మనం చేసే ప్రతి పనికీ ఏదో ఒక ఫలితం ఉంటుంది. అది మంచైనా, చెడైనా ఎదుర్కోవాల్సిందే కదా!” అంది చరిత.
“అలాగని పులి నోట్లో తల పెట్టమని చెప్పడం ఎలా? ఇప్పుడు ప్రభ ఎంత బాధపడి ఉంటాడో! నేను బండి దిగి లోపలికి వెళ్లాను కాబట్టి ఎలాగోలా పరిస్థితి అదుపులోకి వచ్చింది. గౌరీగారు ఆ సంఘటన చూడలేదు, సరిపోయింది. లేదంటే...” అంటూ గుణేష్ మాట పూర్తిచేయకముందే చరిత కల్పించుకుంది.
“అయిపోయిన విషయం గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించకండి. మీకో విషయం తెలుసా? ఈ సృష్టిలో కారణం లేకుండా ఏదీ జరగదు. ఇంత పెద్ద సంఘటన జరిగిందంటే, దాని వెనుక కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. మనం అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు. కానీ కొన్ని సంఘటనలు మన జీవితాలను కొత్త మలుపు తిప్పుతాయి. అందుకే జరిగినదాని గురించి బాధపడకుండా, దాని వల్ల మంచి జరగాలని కోరుకుందాం” అంది చరిత చిరునవ్వుతో.
“నిజమే! నువ్వు చెప్పింది ఆలోచిస్తుంటే నిజమనిపిస్తోంది. మనం మంచినే కోరుకుందాం” అన్నాడు గుణేష్. అతని మనసులోని ఆందోళన కాస్త తగ్గింది.
***
అమ్మతో కలిసి ఇంటికి వచ్చిన ప్రభ, గౌరీ బండి దిగగానే లోపలికి వెళ్లకుండా మరోవైపు వెళ్లిపోయాడు.
“ప్రభా!” అంటూ గౌరీ పిలిచినా అతని చెవులకు ఆ పిలుపు చేరినట్టు లేదు. మనసులోని బాధ అతన్ని ఎంతగా కుదిపేస్తోందంటే, తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో లేడు.
బైక్ నడుపుకుంటూ వెళ్తున్న అతను తెలియకుండానే ఓ వైన్ షాప్ ముందు ఆపాడు. ఎదురుగా ఉన్న దుకాణాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
‘ఇదేంటి? నేను బండి ఇక్కడ ఎందుకు ఆపాను?’ అనుకుంటుండగానే, తమ బస్తీలోని సోమరాజు చేతిలో బాటిల్ పట్టుకుని బయటకు వచ్చాడు.
ప్రభను చూసి ఆశ్చర్యపోతూ, “అరే! ఇదేం విడ్డూరం! ఎప్పుడూ ఈ వైపు రాని ప్రభ ఇక్కడికి వచ్చాడేంటి? కొంపదీసి మనసు వికలమైందా? లేకపోతే...” అంటూ ఏదో అనబోయాడు.
అతని మాటలు పూర్తికాకముందే ప్రభ అక్కడి నుంచి బైక్ దగ్గరకు వెళ్లాడు. బండిని స్టార్ట్ చేయబోతూ మరోసారి ఆ వైపు చూశాడు.
‘ఛీ! నేనేంటి? ఎవరి కోసమో మనసు భారమైందని, నాకే తెలియకుండా ఇలాంటి చోటుకు వచ్చాను? ఒకరి కోసం మనకు ఇష్టం లేని అలవాట్లను ఎప్పటికీ అలవాటు చేసుకోకూడదు. వాళ్లేమైనా పుట్టుకతోనే మనతోపాటు ఉన్నవాళ్లా? మన జీవితంలోకి ఎవరు వస్తారో, ఎవరు దూరమవుతారో కాలమే నిర్ణయిస్తుంది. అంతమాత్రాన నా వ్యక్తిత్వాన్ని నేనే ఎందుకు మార్చుకోవాలి?’
తనను తానే ప్రశ్నించుకున్న ప్రభ, బండిని స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు.
కొద్దిసేపటికి మేడమ్ ఇంటి ముందు బైక్ ఆపాడు.
కాలింగ్ బెల్ నొక్కి, తలుపు తెరుచుకుంటుందేమోనని ఎదురుచూశాడు. ఎంతసేపటికీ తలుపు తెరుచుకోకపోవడంతో మరోసారి బెల్ నొక్కాడు. ఈసారి తలుపు తెరుచుకుంది.
ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే మేడమ్ ముఖంలో ఈరోజు ఆ నవ్వు లేదు. అలసట, దిగులు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
“రా ప్రభా!” అని పిలవడంతో లోపలికి వెళ్లాడు.
“ప్రభా! ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో. ఇప్పుడే వస్తాను” అని చెప్పి మేడమ్ లోపలికి వెళ్లింది.
పది నిమిషాలు గడిచినా ఆమె తిరిగి రాలేదు.
ప్రభ అటూ ఇటూ చూస్తుండగా, మేడమ్ ఉన్న గది తలుపు తెరిచి ఉండటం కనిపించింది. ఏమైందోనని అటువైపు వెళ్లి తలుపు దగ్గర నిలబడ్డాడు.
అక్కడ కనిపించిన దృశ్యం అతని హృదయాన్ని కలచివేసింది.
‘నేను చూస్తున్నది మా మేడమ్నేనా?’ అని ఆశ్చర్యపోయాడు.
తరగతి గదిలో విద్యార్థులతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే మేడమ్... ఈరోజు మాత్రం తన భర్తను లేపి మంచంపై పడుకోబెట్టడానికి నానా అవస్థలు పడుతోంది.
ఆయనకు జరిగిన ప్రమాదంలో ఒక కాలును తొలగించాల్సి వచ్చింది. అప్పటినుంచి ప్రతి చిన్న పనికీ మరొకరి సహాయం అవసరమవుతోంది.
మేడమ్ ఒక్కరే ఆయనను పైకి లేపడానికి ప్రయత్నిస్తుండటంతో ప్రభ వెంటనే లోపలికి వెళ్లి సహాయం చేశాడు.
ఇద్దరూ కలిసి ఆయనను మంచంపై పడుకోబెట్టారు. మందులు ఇచ్చి, పక్కనే నీళ్ల బాటిల్ ఉంచారు. అవసరమైనప్పుడు పిలవడానికి వీలుగా ఒక చిన్న బెల్‌ను కూడా టేబుల్‌పై ఏర్పాటు చేశారు.
అన్ని సర్దిన తర్వాత మేడమ్, ప్రభ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు.
“మేడమ్! సార్‌కు ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?” అని ప్రభ అడిగాడు.
మేడమ్ నిట్టూరుస్తూ చెప్పడం ప్రారంభించింది.
“మీ సార్‌కు కొంచెం తాగే అలవాటు ఉందిరా. అయినా సాధ్యమైనంతవరకు జాగ్రత్తగానే ఉంటారు. ఆరోజు మాత్రం అసలు తాగలేదని చెప్పారు. ప్రమాదం ఆయన తప్పిదం వల్ల జరిగిందో, అవతలి వాళ్ల తప్పిదమో అర్థం కాలేదు. పైగా ప్రమాదం జరిగిన ప్రదేశం పట్టణానికి దూరంగా ఉండటంతో, ప్రమాదానికి కారణమైన వాహనం కూడా ఆగకుండా వెళ్లిపోయింది. కనీసం ఆర్థిక సాయం కూడా అందలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం బాగానే చేశారు కాబట్టి సరిపోయింది” అంది.
“మేడమ్! మరి మీ అబ్బాయి...” అంటూ ప్రభ ప్రశ్న పూర్తి చేయకముందే ఆమె చెప్పడం మొదలుపెట్టింది.
“వాడు వారం రోజుల క్రితమే వచ్చి నాన్నను ఆసుపత్రిలో చూపించి వెళ్లాడు. తాను ఉద్యోగంలో స్థిరపడ్డాడు కాబట్టి వచ్చే నెలలో నన్నూ, వాళ్ల నాన్ననూ తన దగ్గరకు తీసుకెళ్తానని చెప్పాడు. కానీ అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. అయినా వచ్చేవారం వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. వాళ్ల నాన్నకు కృత్రిమ కాలు అమర్చిస్తానని, అప్పటివరకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు” అంది మేడమ్.
“ఇప్పుడు సార్ ఆరోగ్యం ఎలా ఉంది మేడమ్?” అని అడిగాడు ప్రభ.
“ఇప్పుడైతే బాగానే కోలుకున్నారు. కాకపోతే కాలు పోయిందన్న బాధ ఒక్కటే మిగిలింది” అంది ఆమె.
“సార్ చాలా ధైర్యవంతులు మేడమ్! ఒక కాలు లేదని ఆయన ధైర్యాన్ని కోల్పోరు. మీరు కూడా బాధపడకండి. కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కృత్రిమ కాలు అమర్చిన తర్వాత మళ్లీ తనంతట తాను నడవగలుగుతారు. ధైర్యంగా ఉండండి” అన్నాడు ప్రభ ఓదార్పుగా.
ఆ మాటలకు మేడమ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
“నాకు కావాల్సింది కూడా అదే రా! ఇంట్లో వాళ్లు ఆరోగ్యంగా, హుషారుగా ఉంటేనే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వచ్చే నెలలో అబ్బాయి దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నాం. నాదేమీ ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు తీసుకుని వెళ్లిపోవడానికి. కాన్వెంట్లలో, ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసేవాళ్ల పరిస్థితి అంతే. అవసరమైతే వెళ్లిపోవచ్చు, లేదంటే ఉద్యోగం వదిలేయాలి. ఈ ఒత్తిడిని కూడా ఇక తట్టుకోలేకపోతున్నాను. అక్కడికి వెళ్లాక ఏదైనా వేరే పని చూసుకోవాలని అనుకుంటున్నాను” అంది మేడమ్.
ఆమె మాటలు వింటున్న ప్రభ మనసు భారమైంది.
‘దేవుడు ఒకరి గడప మూసేస్తే, మరొకరి గడప తెరుస్తాడని పెద్దలు ఊరికే అనలేదు. ఈమె ఎంత కష్టపడే మనిషి! నాలుగైదుసార్లు పోటీ పరీక్షలు రాసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. అయినా నిరాశపడకుండా ఉన్న ఉద్యోగంతోనే తన విద్యార్థులకు న్యాయం చేస్తూ ,సంసారాన్ని నెట్టుకొస్తూ, భర్తకు తోడుగా నిలబడి, కొడుకును ఉన్నత చదువులు చదివించారు. ఇప్పుడు ఆ కొడుకు జీవితంలో స్థిరపడ్డాడు. ఇకనైనా ఈ ఇద్దరూ ప్రశాంతంగా ఉండాలి’ అని అనుకున్నాడు
.అలా ఆలోచిస్తూ నేలవైపు చూస్తున్న ప్రభను గమనించిన మేడమ్, “ఏంట్రా ప్రభా! ఏదో ఆలోచిస్తున్నావు? ఇదిగో, ఈ కాఫీ తాగు” అంటూ కాఫీ గ్లాసు అందించింది.
“అలాగే మేడమ్” అంటూ తల ఊపి గ్లాసు అందుకున్నాడు.
“ప్రభా! నువ్వు మా ఇంటికి చాలా అరుదుగా వస్తుంటావు. ఈరోజు అనుకోకుండా వచ్చావు. ఏదైనా నాతో చెప్పాలనుకుంటున్నావా?” అని అడిగింది మేడమ్.
కాఫీ గ్లాసును పెదవుల దగ్గరకు తీసుకెళ్లిన ప్రభ, తన మనసులోని మాట ఎలా చెప్పాలి నేను చెప్పడం కంటే తనే అడిగితే మేలు అనుకుని ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేక కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
ఇద్దరూ కాసేపు మౌనంగానే కాఫీ తాగారు.
ప్రభ ఇంతకీ ఆరోజు చెప్పినా దాని గురించి ఏమైనా ఆలోచించావా?
నేను ఇంకా నాగోల్ నే చూడలేదు ప్రస్తుతం దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అని చెబుతూ ఉన్నా కూడా నారాయణ , గీతిక లు అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి.
నువ్వు నీ లక్ష్యం చేరుతానని నాకు నమ్మకం ఉంది కానీ సహాయం చేశారు కాబట్టి ఫార్మాలిటీ కోసం చెస్ట్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి రారా ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచిద్దాం బహుశా అది కూడా నీ మంచికే దారి చూపించ వచ్చేమో! అని మేడం చెబుతుంది.
" అలాగే మేడం " అని చెప్పడంతో ఆమె చాలా సంతోషిస్తుంది. ఈ మాట ముందుగా మీ అమ్మకి చెప్పాలి రా అంటే ఫోన్ చేయబోతుంది.
కానీ మేడం అన్న ప్రాబ్లం మాటలకి అటు తిరిగి చూస్తుంది.
నేను కచ్చితంగా కోచింగ్ అయితే వెళ్తాను.
సరే నీ ఇష్టం నేను చెబుతున్నాను కదా ఇది కూడా నీకు అనుకూలంగానే మారొచ్చేమో కానీ ఒక ప్రయత్నం అంతే
సరే అని చెప్పి బైకు నడుపుతుంటే మేడం చెప్పింది కరెక్ట్ నేను కచ్చితంగా అమ్మ కోసమైనా వెళ్లాలి లేదంటే అమ్మ నాకోసం ఎంత కష్టపడుతుంది అందుకే నేను వెళ్లాలి తండ్రి కూతుర్లకి కూడా బుద్ధి రావాలి అనుకొని ఇంటికి చేరుతాడు.