Witness in Telugu Anything by Writer raguvaran books and stories PDF | సాక్షి సాక్షాత్ - 3

Featured Books
Categories
Share

సాక్షి సాక్షాత్ - 3

అధ్యాయం — ఐదేళ్ల తర్వాత ఆ రాత్రి
రాత్రి తొమ్మిది గంటలు.

ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.

రోజంతా ఎదురైన భావోద్వేగాలన్నీ ఒక్కొక్కటిగా అంజు మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఐదేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న ఎదురుచూపు... భర్త తిరిగి వచ్చాడన్న ఆనందం... అతను తనతో సరిగ్గా మాట్లాడకపోవడంతో కలిగిన బాధ...

ఆలోచనలు ఆగకపోయినా, అలసిపోయిన శరీరం మాత్రం ఇక ఆ భారాన్ని మోయలేకపోయింది.

అంజు మంచం మీద నిద్రలోకి జారుకుంది.

కొద్దిసేపటి తర్వాత...

గది తలుపు చాలా నెమ్మదిగా తెరుచుకుంది.

రుద్ర లోపలికి వచ్చాడు.

బయట నుంచి వచ్చిన అతను కొన్ని క్షణాలు అక్కడే నిలబడి నిద్రపోతున్న అంజును చూశాడు.

ఐదేళ్లు.

తన కోసం ఐదేళ్లు ఎదురుచూసిన మనిషి... ఇప్పుడు తన ముందే ప్రశాంతంగా నిద్రపోతోంది.

రుద్ర ముఖంలో మళ్లీ ఆ భావశూన్యతే కనిపించింది.

కానీ ఆ భావశూన్యత వెనుక ఏదో పెద్ద తుఫాను దాగి ఉంది.

అతను నెమ్మదిగా మంచం దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.

తన చేయి ఆమె తలపైకి తీసుకెళ్లి, చాలా మృదువుగా నిమిరాడు.

ఆ తర్వాత ఆమె బుగ్గను సున్నితంగా తట్టాడు.

“అంజూ...”

ఆమె కదల్లేదు.

“అంజూ... లేవు.”

రుద్ర గొంతు వినగానే అంజు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.

నిద్రమత్తులో అతని వైపు చూసింది.

తన పక్కనే భర్త కూర్చుని ఉండటాన్ని చూసిన క్షణంలోనే ఆమె కళ్ళలో చిన్న వెలుగు మెరిసింది.

“కొంచెం భోజనం పెడతావా?”

అంతే.

ఆ ఒక్క మాట చాలు.

ఐదేళ్ల తర్వాత తన భర్త తన దగ్గర ఏదో అడిగాడు.

అంజు వెంటనే మంచం మీద నుంచి లేచింది.


---

వంటగదిలో...

రాత్రి తొమ్మిదిన్నర.

అంజు గబగబా ప్లేటు తీసుకొచ్చింది. గ్లాసులో నీళ్లు పోసింది. అన్నం వడ్డించింది. కూర వేసింది.

రుద్ర మాత్రం కింద కూర్చుని భోజనం మొదలుపెట్టాడు.

అంజు అతని ఎదురుగా కాకుండా... అతని పక్కనే కాళ్లు మడుచుకుని కూర్చుంది.

ఆమె చూపులు మాత్రం అతని మీదే.

ఒక్క క్షణం కూడా రెప్పవాల్చకుండా చూస్తోంది.

ఐదేళ్లుగా చూడని మనిషిని చూసినప్పుడు ఇంకేం చేయగలదు?

అతను ఎలా తింటున్నాడో కూడా ఆమెకు ఒక అందమైన దృశ్యంలా అనిపిస్తోంది.

రుద్ర ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.

ఆమె చూపు తన మీదే ఉందని గమనించాడు.

“ఏంటి?”

అంజు ఏమీ మాట్లాడలేదు.

“ఇంకా తినలేదా?”

ఆమె మౌనంగా తల ఊపింది.

రుద్ర ఆమె ముఖాన్ని గమనించాడు.

“మొహం వాడిపోయింది. ఇంకా బాధ ఎందుకు?”

చిన్నగా నవ్వాడు.

“నేను వచ్చాను కదా!”

ఆ మాట అంజు గుండెను తాకింది.

రుద్ర మరో ముద్ద కలిపాడు.

అది తన నోట్లో వేసుకోకుండా... అంజు వైపు చాపాడు.

“తిను.”

అంజు కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి.

ఆమె నెమ్మదిగా నోరు తెరిచి ఆ ముద్దను తీసుకుంది.

ఐదేళ్ల నిరీక్షణ తర్వాత భర్త చేత్తో తినిపించిన ఆ ఒక్క ముద్ద...

ఆమెకు అది భోజనం కాదు.

ఐదేళ్లుగా తనకు దూరంగా ఉన్న భర్త నుంచి వచ్చిన మొదటి ప్రేమకు గుర్తు.

ఒక కన్నీటి చుక్క ఆమె కంటికోన నుంచి జారి బుగ్గ మీదుగా కిందికి వచ్చింది.

అదే సమయంలో ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు పుట్టింది.

రుద్ర ఆ నవ్వును చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు.

“అబ్బా...”

అతని కళ్ళలో కూడా చిన్న వెలుగు.

“చాలా బాగుంటావ్.”

అంజు సిగ్గుతో తల దించుకుంది.

“ఇలాగే నవ్వుతూ ఉండాలి.”

ఆ మాటకు ఆమె గుండె మరింత తేలికైంది.

కొద్దిసేపటి తర్వాత అంజు కూడా ఒక ముద్ద కలిపింది.

“నేను కూడా తినిపిస్తా.”

అంటూ రుద్ర నోటికి అందించింది.

రుద్ర నవ్వుతూ ఆ ముద్ద తిన్నాడు.

ఆ రాత్రి...

ఐదేళ్ల తర్వాత మొదటిసారి వాళ్ళిద్దరూ ఒకే ప్లేటులో కాదు...

ఒకే జ్ఞాపకంలో భోజనం చేశారు.


---

రాత్రి పది గంటలు

గదిలో దీపం ఆరిపోయింది.

బయట వెన్నెల.

మంచం మీద ఇద్దరూ పడుకున్నారు.

రుద్ర తన వైపు తిరిగి పడుకున్నాడు.

అంజు మాత్రం అతని పక్కనే ఉన్నా... అతనికి చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపించింది.

భర్త తన పక్కనే ఉన్నాడు.

అతని శ్వాస వినిపిస్తోంది.

అతని ఉనికి తెలుస్తోంది.

కానీ ఆ ఐదేళ్లు వాళ్ళ మధ్య ఒక అదృశ్య గోడలా నిలబడి ఉన్నాయి.

ఆ గోడను చెరిపేయాలని అంజు నెమ్మదిగా అతని వైపు జరిగింది.

తన చేయిని అతని మీద వేయబోయింది.

అంతలో...

రుద్ర ఒక్కసారిగా మరో వైపు తిరిగి పడుకున్నాడు.

అంజు చేయి మధ్యలోనే ఆగిపోయింది.

ఆమె కళ్ళలోని చిన్న వెలుగు మళ్లీ ఆరిపోయింది.

“ఇప్పుడే ప్రేమగా మాట్లాడాడు... మరి ఇప్పుడు ఎందుకు ఇలా?”

ఆమెకు అర్థం కాలేదు.

ఆమె కూడా నెమ్మదిగా మరో వైపు తిరిగి పడుకుంది.

చీకట్లో ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి.

“ఎందుకని నన్ను పట్టించుకోవడం లేదు?”

ఆమె మనసులో ప్రశ్న.

“ప్రేమగా మాట్లాడుతున్నాడు... కానీ దగ్గరకు మాత్రం రానివ్వడం లేదు ఎందుకు?”

ఆ ప్రశ్నకు సమాధానం లేకుండానే ఆ రాత్రి కొంతసేపు గడిచిపోయింది.


---

అర్ధరాత్రి

గడియారం పన్నెండు కొట్టింది.

ఇంటంతా నిశ్శబ్దం.

కిటికీలోంచి వచ్చిన వెన్నెల మంచం మీద తెల్లటి వెలుగును పరిచింది.

అంజు నిద్రపోతున్నట్టుగా నటిస్తోంది.

రుద్ర మాత్రం కళ్ళు మూసుకుని చాలా సేపటి నుంచి మేలుగానే ఉన్నాడు.

అతని మనసులో యుద్ధం జరుగుతోంది.

చివరికి...

అతను నెమ్మదిగా పక్కకు తిరిగాడు.

అంజు భుజం మీద తన తల పెట్టాడు.

తన బుగ్గను ఆమె బుగ్గకు ఆనించాడు.

“ఇంకా నిద్రపోలేదా?”

గొంతు చాలా చిన్నగా ఉంది.

అంజు కళ్ళు తెరిచింది.

సమాధానం చెప్పకుండా లేదన్నట్లు తల ఊపింది.

అదే సమయంలో—

రుద్ర కంటికోన నుంచి ఒక కన్నీటి చుక్క జారి ఆమె బుగ్గపై పడింది.

అంజు ఉలిక్కిపడింది.

వెంటనే అతని వైపు తిరిగింది.

రుద్ర కళ్ళలో నీళ్లు.

“ఎందుకు ఏడుస్తున్నావ్?”

అతను సమాధానం చెప్పలేదు.

తర్వాతి క్షణంలోనే ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.

అంజు గుండెలకు ముఖం ఆనించి...

ఐదేళ్లుగా తనలో దాచుకున్న బాధను ఒక చిన్నపిల్లాడిలా బయటకు వదిలేశాడు.

“నన్ను క్షమించు అంజూ...”

అతని గొంతు వణికింది.

“నిన్ను కావాలని వదిలేయలేదు.”

అంజు నిశ్శబ్దంగా అతని తల నిమిరింది.

“ఈ ఐదేళ్లు నువ్వెన్ని బాధలు పడ్డావో నాకు తెలియదు... కానీ నీ మొహం చూస్తుంటే... నీలో ఉన్న బాధ నాకు అర్థమవుతోంది.”

రుద్ర మరింత గట్టిగా ఆమెను హత్తుకున్నాడు.

“నీకు నా మీద కోపం ఉండొచ్చు... బాధ ఉండొచ్చు... కానీ నన్ను క్షమించు.”

అంజు అతని కన్నీళ్లు తుడిచింది.

“ఏంటి రుద్ర ఇది?”

ఆమె స్వరం ప్రేమతో నిండిపోయింది.

“నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నువ్వు ఎంత దూరం వెళ్లినా... ఎంత కష్టపడినా... అది మా కోసమే కదా?”

రుద్ర కళ్ళు మూసుకున్నాడు.

“మీ కోసమే వెళ్లాను...”

ఒక్క క్షణం ఆగాడు.

“కానీ మిమ్మల్ని ఇంత కష్టపెడతానని అనుకోలేదు.”

అతని గొంతులో మళ్లీ బాధ.

“అక్కడ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాను. ఎక్కడైనా చిన్న పిల్లలు ఆడుకుంటుంటే... నా పిడుగు రాజానే గుర్తొచ్చేవాడు.”

అతను కన్నీళ్లు తుడుచుకున్నాడు.

“రాత్రయితే నిద్ర పట్టేది కాదు. నిన్ను, వాడిని వెంటనే నా దగ్గరకు తీసుకెళ్లిపోవాలని ఎన్నిసార్లు అనిపించిందో...”

అంజు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి.

“కానీ నా పరిస్థితుల్లో మిమ్మల్ని అక్కడికి తీసుకురావడం మంచిది కాదని నాకు నేను చెప్పుకున్నాను.”

ఆమె ఇక ఆపుకోలేకపోయింది.

అతన్ని గట్టిగా హత్తుకుంది.

“సరే...”

ఆమె మెల్లగా చెప్పింది.

“ఏదో అయిపోయింది. ఇప్పుడు వచ్చేశావు కదా... ఇక ఆ బాధలన్నీ మర్చిపోదాం.”

ఆ మాటతో రుద్ర ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాడు.


---

అర్ధరాత్రి తర్వాత

కొంతసేపు వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు.

అంజు మనసులో మాత్రం ఒక సందేహం.

“అవును...”

ఆమె మెల్లగా అడిగింది.

“ఇవన్నీ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావ్? ఇంటికి రాగానే మాట్లాడొచ్చు కదా. అక్కడ ఎందుకు అంత సైలెంట్‌గా ఉన్నావ్?”

రుద్ర చిన్నగా నవ్వాడు.

“ఏం చేద్దాం...”

అతని గొంతులో ఇంకా బరువు ఉంది.

“మీలాగా ఎమోషన్స్‌ని టక్కున బయటపెట్టే మనుషులం కాదు కదా మేము.”

అంజు మౌనంగా వింటోంది.

“మాకంటూ ఒక మీటర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ‘మగాడు ఏడవకూడదు’ అని వింటూ పెరిగాం.”

చిన్నగా నవ్వాడు.

“నీతో ఒక్కసారి మాట్లాడటం మొదలుపెడితే... నన్ను నేను ఆపుకోలేనని భయపడ్డాను. ఏడుపు తన్నుకొస్తుందని తెలుసు. అందుకే సైలెంట్‌గా ఉన్నాను.”

అంజు అతని మాటలు విని మెల్లగా నవ్వింది.

“అవునూ... రామారావు గారి దగ్గరికి ఎందుకు వెళ్లావు?”

“నేను అప్పులు చేశాను కదా...”

రుద్ర ప్రశాంతంగా చెప్పాడు.

“ఆ డబ్బులు ఆయనకు ఇచ్చాను. ఆయన ఊర్లో పెద్దమనిషి. మన అప్పులన్నీ తీర్చేశాడు. ఇక మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.”

అంజు కళ్ళలో ఉపశమనం.

“నిన్ను అస్సలు వదలను.”

ఆమె వెంటనే చిలిపిగా చూసింది.

“అప్పుడెప్పుడో వదలకు గానీ...”

చిన్న విరామం.

“ఇప్పుడు మాత్రం వదిలేస్తూ ఉండు.”

రుద్ర నవ్వాడు.

“అబ్బో... నా మీద అంత ప్రేమ ఉందా?”

అంజు బుంగమూతి పెట్టింది.

“ప్రేమ కాదు...”

చిన్నగా ఆగి అతని వైపు చూసింది.

“కోరిక!”

రుద్ర ఒక్కసారిగా నవ్వాడు.

అంజుకు మళ్లీ కోపం వచ్చింది.

“అయినా నీకు కొంచెం కూడా తెలివి లేదు రుద్ర!”

“ఎందుకు?”

“నువ్వు అప్పుడే అందరి ముందు నాతో మాట్లాడి ఉంటే... ఊర్లో వాళ్ళందరికీ మా ఆయన వచ్చేశాడని గొప్పగా చెప్పుకునేదాన్ని. అంతా నీ ఇష్టమే చేస్తావ్!”

రుద్ర ఆమె వైపు చూస్తూ నవ్వాడు.

“నీ కోపం చూస్తే నాకు నవ్వొస్తుంది.”

అతను ఆమె ముక్కును మెల్లగా గిల్లాడు.

“నీ ముక్కు చూస్తే నాకు భలే ఇష్టం... చిలక ముక్కు పిల్ల!”

అంజు నవ్వుతూ అతని చేతిని కొట్టింది.

ఆ రాత్రి...

వాళ్ళ మధ్య ఐదేళ్లుగా పేరుకున్న దూరం నెమ్మదిగా కరిగిపోయింది.


---

ఉదయం 5:30

తెల్లవారుజామున సూర్యకిరణాలు కిటికీ గుండా గదిలోకి జారుకున్నాయి.

మంచం మీద అంజు ప్రశాంతంగా నిద్రపోతోంది.

ఆమె జుట్టు విరబోసుకుంది.

బొట్టు కాస్త చెదిరిపోయింది.

నిన్నటి అలసట ఇంకా ముఖంలో కనిపిస్తోంది.

ఆమె పక్కనే రుద్ర తన చేతులతో ఆమెను చుట్టేసుకుని గాఢంగా నిద్రపోతున్నాడు.

బయట నుంచి రుద్ర తల్లి గొంతు వినిపించింది.

“అంజూ... అమ్మా అంజూ! తెల్లారింది లేవమ్మా... పనులున్నాయి.”

అంజుకు మెలకువ వచ్చింది.

రుద్ర చేతుల నుంచి బయటపడాలని చూసింది.

కానీ అతని పట్టు ఇంకా బిగువుగానే ఉంది.

అంజు చిన్నగా నవ్వుకుంది.

ఎన్నాళ్లకో తన భర్త చేతుల్లో ఇలా చిక్కుకుంది.

అతనికి మెలకువ రాకుండా జాగ్రత్తగా అతని చేతులను విడదీసి లేచింది.

తన బట్టలు సర్దుకుని గది బయటికి వెళ్లింది.

కొద్దిసేపటి తర్వాత బయట తాతయ్య దగ్గర పడుకుని ఉన్న తన కొడుకును ఎత్తుకుని మళ్లీ గదిలోకి వచ్చింది.

బాబును మంచం మీద పడుకోబెట్టింది.

అన్నీ సర్ది బయటికి వెళ్లిపోయింది.


---

ఉదయం 6:30

ఇంటి వాకిలి శుభ్రం చేసింది.

బయట ఉన్న మంచాలు సర్దింది.

పనులన్నీ ముగించుకుని మళ్లీ గదిలోకి వచ్చింది.

మంచం వైపు చూసిన క్షణం...

అంజు అడుగులు ఆగిపోయాయి.

మంచం మీద రుద్ర, అతని కొడుకు ఇద్దరూ బోర్లా పడుకుని ఉన్నారు.

ఒకరి పక్కన ఒకరు.

ఒకే భంగిమ.

ఒకే ప్రశాంతత.

అంజు పెదవులపై అందమైన నవ్వు విరిసింది.

“అబ్బా...”

ఆమె మెల్లగా అనుకుంది.

“అప్పా కొడుకులు ఎప్పటికీ మారరు!”

ఆమె ముందుకు వెళ్లి బాబు బుగ్గపై ముద్దు పెట్టింది.

తర్వాత తన ఫోన్ తీసుకుంది.

క్లిక్!

ఆ క్షణం ఫోన్‌లో బంధించబడింది.

ఐదేళ్ల తర్వాత...

తన భర్త, తన కొడుకు ఒకే ఫ్రేమ్‌లో.

అంజు ఆ ఫోటోను చూస్తూ మురిసిపోయింది.

అప్పుడే గుమ్మం దగ్గర అత్తగారు కనిపించారు.

“ఏంటమ్మా...”

ఆమె నవ్వుతూ అంజును ఆటపట్టించింది.

“చాలా రోజుల తర్వాత మొగుడిని, కొడుకుని ఇద్దరినీ ఒకేసారి చూసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టుంది!”

అంజు సిగ్గుతో తల దించుకుంది.

“సరే పద... వాళ్ళు లేచేలోపు వంట పూర్తి చేస్తే మన పని అయిపోతుంది.”

అత్తగారి వెనకే అంజు వంటగదిలోకి వెళ్లింది.


---

ఉదయం 7 గంటలు

వంటగదిలో మళ్లీ పాత సందడి మొదలైంది.

స్టవ్ మీద కూర ఉడుకుతోంది.

అంజు గరిటెతో కూర కలుపుతోంది.

అంతలో...

వెనుక నుంచి ఎవరో నెమ్మదిగా వచ్చారు.

“ఏంటే వదినా...”

అది పార్వతి.

“చాలా రోజుల తర్వాత వచ్చావ్! రాత్రి కనీసం పలకరించలేదు. అంత ఎక్కువైపోయిందా?”

అంజు ఉలిక్కిపడింది.

వెంటనే చేతిలోని గరిటెను పైకెత్తి వెనక్కి తిరిగింది.

“ఎవర్రా అది!”

పార్వతిని చూసిన వెంటనే అంజు ముఖంలో కోపం పోయి నవ్వు వచ్చింది.

పార్వతి మాత్రం గరిటెను చూసి భయపడినట్టు నటించింది.

“అమ్మో వదినమ్మా! ఎందుకంత సీరియస్? సరదాగా అన్నాను.”

అంజు నవ్వుతూ దగ్గరకు రమ్మని సైగ చేసింది.

పార్వతి దగ్గరకు రాగానే ఆమె చెవి పట్టుకుంది.

“రావే... రాత్రి ఎక్కడికి వెళ్లావు? అసలు కనిపించలేదు!”

“అదేం లేదు వదినమ్మా... నా ఫ్రెండ్‌తో చదువుకోవడానికి వెళ్లాను.”

అంజు కనుబొమ్మలు పైకెత్తింది.

“నాకే అబద్ధాలు చెప్తావా?”

పార్వతి నవ్వింది.

“ఈ కాలంలో అంత ఇంట్రెస్ట్‌గా చదివేంత ఉందా నీకు?”

పక్కనే ఉన్న టమాటాలు ఆమె చేతిలో పెట్టింది.

“ఇదిగో... ముందు ఇవి నీట్‌గా కట్ చెయ్.”

పార్వతి నవ్వుకుంటూ టమాటాలు కోయడం మొదలుపెట్టింది.

వంటగదిలో మళ్లీ నవ్వులు.

మళ్లీ పాత కుటుంబం.

మళ్లీ అంజు ముఖంలో ఎన్నాళ్లకో కనిపించిన ఆ వెలుగు.


---

ఉదయం 7:15

పార్వతి టమాటాలు కోయడానికి ప్రయత్నిస్తోంది.

కానీ ఆమె చేతికి కత్తి సరిగ్గా రావడం లేదు.

కొంతసేపటికి విసుగు వచ్చేసింది.

“ఇవి నా వల్ల కాదు!”

అంటూ గట్టిగా అరిచింది.

“ఒరేయ్ అన్నయ్యా! నీ భార్య నన్ను చంపేలా ఉంది! ఏకంగా కత్తి తీసుకుంది!”

అదే సమయంలో...

నిద్ర లేచి, నోట్లో బ్రష్ పెట్టుకుని రుద్ర హాల్లోకి వచ్చాడు.

చెల్లెలి అరుపు వినగానే ఒక్కసారిగా ఆగిపోయాడు.

“ఏంటే... ఏం జరుగుతుంది అక్కడ?”

అతని గొంతు కాస్త గట్టిగానే ఉంది.

అంజుకు అది నచ్చలేదు.

ఆమె చేతిలోని గరిటెను పక్కన పెట్టింది.

కూరగాయలు కోసే కత్తిని చేతిలోకి తీసుకుంది.

నెమ్మదిగా వెనక్కి తిరిగింది.

కళ్ళు పెద్దవిగా చేసి రుద్ర వైపు చూసింది.

రుద్ర నోట్లో ఉన్న బ్రష్ మధ్యలోనే ఆగిపోయింది.

అతని కళ్ళు కత్తి మీద...

తర్వాత అంజు ముఖం మీద...

మళ్లీ కత్తి మీద.

అతని గొంతు వెంటనే మారిపోయింది.

“ఏం లేదు...”

చిన్నగా నవ్వాడు.

“కామన్... కామెడీ... కామెడీ!”

అంటూ బ్రష్ చేసుకుంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.

పార్వతి నవ్వు ఆపుకోలేకపోయింది.

“పోరా సచ్చినోడా!”

రుద్ర వెళ్తున్న వైపు చూస్తూ అంది.

“భార్యను కంట్రోల్ చేయలేవు... మళ్లీ నీకు పెళ్లెందుకు రా?”

రుద్ర మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు.

“దమ్ముంటే నా తోటి గొడవ పడతది రారా!”

అని పార్వతి మళ్లీ అంది.

“అయినా నీకు, మీ అన్నకు అంత సీన్ లేదులే!”

రుద్ర అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

పార్వతి మళ్లీ అంజు దగ్గరకు తిరిగింది.

“అమ్మ వదినమ్మా...”

చిలిపిగా అడిగింది.

“ఇంతకీ నా అల్లుడికి పేరైనా పెట్టావా లేదా?”

ఆ ఒక్క ప్రశ్న...

అంజు చేతిని ఆపేసింది.

గరిటె గాల్లోనే నిలిచిపోయింది.

ఆమె కళ్ళు మెల్లగా మూసుకుంది.

ఐదేళ్లు...

ఐదేళ్లుగా తన భర్త కోసం ఎదురుచూసిన రోజులు ఒక్కసారిగా ఆమె కళ్ళముందు మెదిలాయి.

తన కొడుకు పుట్టిన రోజు...

అతని తండ్రి కోసం ఎదురు చూసిన రోజులు...

“ఎప్పుడు వస్తాడు?”

“ఎప్పుడు పేరు పెడతాడు?”

అని తనలో తాను అడిగుకున్న ఎన్నో రాత్రులు...

ఆమె వెంటనే ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చింది.

పెదవులపై చిన్న నవ్వు తెచ్చుకుంది.

“నేనొక్కదాన్ని ఏంటే చేసేది?”

పార్వతి వైపు చూసింది.

“మీ అన్నయ్య వచ్చాడు కదా...”

చిన్నగా నవ్వింది.

“వెళ్లి వాడి పీక మీద కాలేసి తొక్కి అడుగు.”

“ఎప్పుడు రా నా మేనల్లుడికి పేరు పెట్టేది అని!”

ఆ మాటలు బయట సింక్ దగ్గర ముఖం కడుక్కుంటున్న రుద్ర చెవులకు స్పష్టంగా వినిపించాయి.

అతని చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి.

ముఖం మీద ఉన్న నీళ్లను తుడుచుకుంటూ అయోమయంగా చూశాడు.

“ఇదేంట్రా ఇది?”

అతను తనలో తాను అనుకున్నాడు.

“పిల్లాడికి పేరు పెట్టాలన్నా నా మీదకే వస్తారా?”

అక్కడికక్కడే అతని ముఖంలో మరో ఆలోచన మెరిసింది.

“ఆగు...”

అతను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేశాడు.

“పిల్లాడికి ఇంకా పేరు కూడా పెట్టలేదా?”

లోపల ఉన్న పార్వతికి కూడా ఆశ్చర్యం వేసింది.

“ఏంటి వదినా... బాబుకి ఇంకా పేరే పెట్టలేదా?”

అంజు చిరునవ్వు నవ్వింది.

కానీ ఆ నవ్వు వెనుక ఐదేళ్ల బాధ దాగి ఉంది.

“అదంతా నాకేం తెలుసురా?”

ఆమె మళ్లీ కూర కలపడం మొదలుపెట్టింది.

“మీ అన్నయ్య వస్తాడని ఆశగా అలా చూశాను.”

ఒక్క క్షణం ఆగింది.

తర్వాత చిలిపిగా నవ్వుతూ—

“వాడి కోసం చూసి చూసి... నా కళ్ళు కాస్త కోడిగుడ్లులా మాడిపోయాయి!”

పార్వతి నవ్వింది.

కానీ బయట నిలబడి ఉన్న రుద్ర మాత్రం నవ్వలేదు.

ఆ మాట అతని గుండెల్లో ఎక్కడో బలంగా తగిలింది.

ఐదేళ్లుగా తన కోసం ఎదురుచూసిన భార్య...

తన కొడుకుకి పేరు పెట్టకుండా...

తండ్రి వచ్చి పేరు పెడతాడని ఎదురు చూసింది.

రుద్ర ముఖంలోని చిరునవ్వు మాయమైంది.

అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి నెమ్మదిగా దూరంగా నడిచాడు.

వంటగదిలో మాత్రం అంజు, పార్వతి నవ్వులు కొనసాగుతున్నాయి.

కానీ...

రుద్ర అడుగులు మాత్రం ఈసారి చాలా భారంగా ఉన్నాయి.

అతని మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలింది—

“ఐదేళ్లు... నా కోసం ఇంతగా ఎదురుచూసిందా అంజు?”

అతను సమాధానం తెలిసిన ప్రశ్ననే తనలో తాను మళ్లీ అడుగుతున్నట్టుగా నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు.

ఐదేళ్ల దూరం ముగిసింది.
కానీ ఆ ఐదేళ్ల గాయాలు ఇంకా మానలేదు. ❤️