సాక్షి సాక్షాత్తు
అధ్యాయం — ఉదయం ఎదురైన గతం
రాత్రంతా రుద్ర అంజును బుజ్జగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
ఒక్కసారి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు.
మరోసారి ఆమెను నవ్వించడానికి ప్రయత్నించాడు.
“అంజూ... ముందు నేను చెప్పేది విను.”
అని ఎన్నిసార్లు చెప్పినా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ముఖం తిప్పుకుని పడుకుంది.
ఆమె కోపం వెనుక ఉన్న భయాన్ని రుద్రకు అర్థమవుతోంది.
కానీ ఇప్పుడే నిజం చెప్పే సమయం కాదని అతని మనసు చెబుతోంది.
చివరికి చేసేది లేక అతను కూడా మరోవైపు తిరిగి పడుకున్నాడు.
రాత్రి ఎప్పుడు గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు.
ఉదయం ఐదు గంటలు.
గడియారం మోగకముందే రుద్ర కళ్ళు తెరిచాడు.
ఆయన నిద్ర నుంచి లేచిన తీరు చూస్తే, ఈ రోజు తన జీవితంలో ఏదో ముఖ్యమైన రోజు అనిపిస్తోంది.
నెమ్మదిగా లేచి స్నానం చేశాడు.
తెల్లటి చొక్కా.
నల్లటి ప్యాంట్.
చేతికి వాచ్.
పర్ఫ్యూమ్.
అద్దంలో తనను తాను ఒకసారి చూసుకున్నాడు.
రుద్ర ఎప్పటిలాగే ఆకర్షణీయంగానే ఉన్నాడు.
కానీ ఈరోజు అతని ముఖంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం అంజుకు మాత్రం నచ్చలేదు.
అతను బయటికి వెళ్లడానికి తలుపు వైపు అడుగు వేయగానే మంచం మీదున్న అంజుకు మెలకువ వచ్చింది.
ఆమె కళ్ళు తెరిచి అతన్ని చూసింది.
“ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు?”
ఆమె గొంతులో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది.
రుద్ర వెనక్కి తిరిగి చూశాడు.
“అక్షర వాళ్లు వచ్చారంట.”
అంజు ముఖం ఒక్కసారిగా కఠినమైంది.
“వెళ్లి వాళ్లను తీసుకుని వస్తాను. నువ్వు ఇంతలోపు పనులన్నీ చూసుకో.”
అతను చాలా సాధారణంగా చెప్పాడు.
“పొద్దున్నకే అందరూ బంధువులు వస్తారు. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు.”
అంతే.
రుద్ర బయటికి వెళ్లిపోయాడు.
అంజు మాత్రం మంచం మీదే కూర్చుని అతను వెళ్లిన తలుపువైపు చూస్తూ ఉండిపోయింది.
“నాకంటే వాళ్లే ఎక్కువయ్యారు...”
అని మనసులో అనుకుంది.
ఆ ఆలోచనే ఆమె గుండెల్లో చిన్న నొప్పిలా మిగిలింది.
---
ఉదయం ఏడు గంటలు
వీధి ఇంకా పూర్తిగా మేల్కొనేలోపే అంజు తన పనుల్లో పడిపోయింది.
వాకిలి ఊడ్చింది.
ఇంటి ముందు నీళ్లు చల్లింది.
బిడ్డకు పాలు ఇచ్చింది.
ఇంట్లో ఒక్కో పని పూర్తి చేస్తూ తన మనసులోని కలతను కూడా పనులతోనే దాచిపెట్టాలని ప్రయత్నించింది.
అప్పుడే దూరంగా బైక్ శబ్దం వినిపించింది.
రుద్ర వచ్చాడు.
అతని వెనకాల ఒక విలాసవంతమైన కారు.
కారు ఇంటి వాకిట్లో ఆగింది.
అంజు చేతిలోని చీపురు ఆగిపోయింది.
కారు వెనుక తలుపు తెరుచుకుంది.
ముందుగా ఒక సున్నితమైన కాలు బయటపడింది.
హైహీల్స్ నేలను తాకాయి.
తర్వాత నీలిరంగు చీర, దానికి గాఢ ఎరుపు రంగు జాకెట్, ఆధునికంగా కట్ చేసిన చిన్న జుట్టు...
కారు నుంచి అక్షర బయటికి దిగింది.
అంజు ఆమెను చూస్తూ కొన్ని క్షణాలు కదలకుండా నిలిచిపోయింది.
అక్షరలో ఒక రకమైన మెరుపు ఉంది.
నగర జీవితపు అలవాటు.
ఆత్మవిశ్వాసం.
నడకలో సహజమైన అందం.
అంజు తనను తాను చూసుకుంది.
పని చేస్తూ మాసిపోయిన బట్టలు.
చెదిరిపోయిన జుట్టు.
మడతలు పడిన చీర.
ఆ క్షణంలో ఆమెకు తన మీద తనకే ఓ చిన్న జాలి కలిగింది.
“ఆమె ఎంత అందంగా ఉంది...”
అని అనుకుంది.
అంతలో కారు తలుపు మళ్లీ తెరుచుకుంది.
ఒక చిన్న పాప దిగింది.
ఆమె ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌లా కనిపించే చిన్న పరికరం ఉంది. దానికి ఒక చిన్న యంత్రం అనుసంధానమై ఉంది.
కారు దిగిన వెంటనే ఆ పాప ఎంతో అలవాటుగా ఆ పరికరాన్ని తీసుకుంది.
చిన్న బ్యాగ్‌లో పెట్టుకుంది.
అంజు చూపు వెంటనే అక్షర నుంచి ఆ పాప మీదికి మారింది.
రుద్ర ఆమెవైపు చూసి—
“ఏదో పలకరించు.”
అన్నట్టుగా సైగ చేశాడు.
అంజుకు అప్పుడే రుద్రపై ఉన్న కోపం మళ్లీ గుర్తొచ్చింది.
చేతిలోని చీపురును బిగించి పట్టుకుంది.
“ఇతన్ని కొట్టాలనిపిస్తోంది...”
అనుకుంది.
కానీ సాక్షి ముఖాన్ని చూసిన క్షణంలో ఆ కోపం కరిగిపోయింది.
ఆ చిన్నారి కళ్ళలో ఏదో అమాయకత్వం ఉంది.
అంజు గుండెల్లో జాలి పుట్టింది.
“ఈ పాపకి ఏమైంది?”
అనే ప్రశ్న మొదటిసారి ఆమె మనసులో మిగిలింది.
---
అధ్యాయం — అక్షర
అక్షర నేరుగా అంజు దగ్గరకు వచ్చింది.
అంజు ముఖంపై చెమటను గమనించింది.
“అంజు నువ్వేనా?”
అని నవ్వింది.
“చాలా బాగున్నావు!”
ఒక్క క్షణం అంజును పరిశీలించి,
“అండ్... చాలా హాట్‌గా కూడా ఉన్నావు!”
అని చిలిపిగా అంది.
అంజు ఒక్కసారిగా ఏమనాలో తెలియకపోయింది.
అక్షర మాత్రం ఆమె చేయి పట్టుకుంది.
“సరే పద పద... ముందు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఈ చీరతో చాలా ఇరిటేషన్‌గా ఉంది.”
అని చెప్పి అంజును వెంట తీసుకుని నేరుగా పడకగదిలోకి వెళ్లిపోయింది.
కొద్దిసేపటికి బయటికి వచ్చినప్పుడు అక్షర తెల్లటి టాప్, నల్లటి ప్యాంట్, చున్నీ వేసుకుని ఉంది.
ఆమె ముఖంలో హాయిగా ఊపిరి పీల్చుకున్న భావం.
“హమ్మయ్య... ఇప్పుడు ఫ్రీగా ఉంది.”
చిన్నగా నవ్వింది.
“హాయ్! నా పేరు అక్షర.”
అంజు మౌనంగా చూసింది.
“సారీ అండి... ముందుగా సరిగ్గా పలకరించలేదని ఏమనుకోకండి. నిన్న సాయంత్రం నుంచే బయలుదేరాం. ఫ్లైట్, కారు... ఇవన్నీ నాకు చాలా ఇరిటేషన్.”
తన చీర వైపు చూసి నవ్వుకుంది.
“అందులో ఈ చీర ఒకటి! నాకు ఊపిరే ఆడలేదు.”
ఆమె ఎంత సహజంగా మాట్లాడుతుందో చూసి అంజు మనసులోని కోపం కరిగిపోయింది.
అక్షర అడిగింది—
“ఇంతకీ మీరు ఎలా ఉన్నారు?”
“బాగున్నారా?”
అంజు తల ఊపింది.
“పని చాలా ఉన్నట్టుంది కదా?”
“అవును...”
“నేను కూడా హెల్ప్ చేస్తాను.”
“అయ్యో... మీరు కూర్చోండి. నేనే చేసుకుంటాను.”
అంజు మొహమాటంగా అంది.
అక్షర వెంటనే నవ్వింది.
“ఇప్పుడు మనం ఒకే ఇంట్లో ఉన్నాం కదా! మొహమాటపడకండి.”
అని చెప్పి వంటగది వైపు వెళ్లిపోయింది.
అంజు ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది.
“ఇదేంటి? నాతో ఇంత త్వరగా కలిసిపోయిందా?”
అని అనుకుంది.
కాసేపటి తర్వాత తిరిగి వంటగదిలోకి వచ్చిన అంజుకు మరో ఆశ్చర్యం ఎదురైంది.
అక్షర అప్పటికే టమాటాలు, ఉల్లిపాయలు, కారం, పప్పు, ఉప్పు అన్నీ ఒక పక్కన సర్ది వంటకు సిద్ధమై ఉంది.
“ఇదేం విచిత్రం!”
అనుకుంటూ అంజు కాళ్లు, చేతులు కడుక్కుంది.
ముఖం కడుక్కుని లోపలికి వచ్చింది.
ఏదో గుర్తొచ్చినట్టు వెంటనే పాలు తీసుకుని టీ పెట్టింది.
రెండు కప్పులు అక్షర, రుద్రకు ఇచ్చింది.
తన కోసం కూడా ఒక కప్పు తీసుకుని వాళ్లతో కూర్చుంది.
కొన్ని క్షణాలు...
ఏ అనుమానం లేదు.
ఏ గొడవ లేదు.
ఏ ప్రశ్న లేదు.
ముగ్గురూ టీ తాగుతూ కూర్చున్నారు.
కానీ అంజు మనసులో మాత్రం ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.
---
అధ్యాయం — ఇద్దరు పిల్లలు
కారు దిగినప్పటి నుంచి సాక్షి తనకు కావాల్సిన ఒక్క వ్యక్తినే వెతుకుతోంది.
రుద్ర దగ్గరకు వచ్చి అడిగింది—
“అంకుల్... తమ్ముడు ఎక్కడ?”
రుద్ర నవ్వాడు.
“అక్కడ ఆడుకుంటున్నాడు.”
సాక్షి వెంటనే సాక్షాత్ దగ్గరకు పరుగెత్తింది.
కింద ఆడుకుంటున్న అతన్ని చూసి ఆనందించింది.
తన చిన్న చేతులతో అతన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించింది.
కానీ సాక్షాత్ బరువుకు ఆమెకు బ్యాలెన్స్ తప్పింది.
అలా కింద కూర్చుంది.
సాక్షిత్‌ను చూసి కళ్ళు చిన్నబుచ్చుకుంది.
“ఏంట్రా బాబూ... ఇంత బరువున్నావు?”
సాక్షాత్ ఆమెను చూస్తూ నవ్వాడు.
“కొంచెం స్లిమ్ అవ్వాలి కదా!”
అని అతని జుట్టు నిమిరింది.
“ఏంట్రా... జుట్టేనా? లేక మునిగి వచ్చావా?”
అని అల్లరి చేసింది.
తర్వాత అతన్ని లేపుతూ,
“నేను మళ్లీ వెళ్లిపోయేలోపు నిన్ను సన్నగా చేసి... నేనే ఎత్తుకుంటా చూడు!”
అంది.
సాక్షాత్ ఏడుపు మర్చిపోయి ఆమెతో ఆడుకోవడం మొదలుపెట్టాడు.
కొద్దిసేపటికి అక్షర వచ్చి సాక్షికి వేసిన తెల్లటి గౌను, పింక్ ప్యాంట్ తీసేసి, సౌకర్యమైన కాటన్ బట్టలు వేసింది.
అది చూసిన తర్వాత ఇద్దరు పిల్లలు మరింత స్వేచ్ఛగా ఆడుకున్నారు.
---
అధ్యాయం — ఒకే పోలిక
ఉదయం ఎనిమిది గంటల సమయంలో రుద్ర ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారింది.
అంజు మాత్రం ఇంకా ఒకే విషయాన్ని గమనిస్తోంది.
అక్షర, రుద్ర కలిసి కారు దిగిన తీరు.
వాళ్లిద్దరి మధ్య ఉన్న సహజమైన సౌకర్యం.
ఆ దృశ్యం ఆమె మనసులోని అనుమానాలను ఇంకా పెంచుతోంది.
టీ కప్పు ఖాళీ అయింది.
అంజు రుద్ర వైపు చూసింది.
అతను అప్పటికే మంచం మీదకి వెళ్లి దుప్పటి కప్పుకుని ఏమీ తెలియని వాడిలా పడుకున్నాడు.
అంజు కళ్లలో చిరాకు.
అంతలో సాక్షి, సాక్షాత్ ఇద్దరూ కలిసి రుద్ర తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లారు.
సాక్షి చలాకీగా నవ్వింది.
“హాయ్ తాతయ్యా! హాయ్ నాయనమ్మా!”
ఆమె వెనకాలే సాక్షాత్ కూడా బుడిబుడి అడుగులతో వచ్చి అదే మాటలు పలికాడు.
“హాయ్ తాతయ్యా... హాయ్ నాయనమ్మా!”
ముసలివాళ్లిద్దరూ ఒకేసారి ఇద్దరు పిల్లలను చూసి ఆశ్చర్యపోయారు.
వాళ్లను దగ్గరకు తీసుకుని ముఖాలు చూశారు.
ఒక్క క్షణం వాళ్లకు నిజంగానే కవల పిల్లల్లా అనిపించింది.
రుద్ర తండ్రి ఆశ్చర్యంతో అన్నాడు—
“ఏంట్రా ఇది? ఎవరు ఈ పాప?”
అతని చూపు ఒకరి నుంచి మరొకరి ముఖానికి మారుతోంది.
“ఇద్దరూ కవల పిల్లల్లా ఉన్నారు!”
తర్వాత నవ్వాడు.
“ఎవరైతే ఏంటిలే... పిల్లలు ఇంట్లో సందడి చేస్తే ఇల్లంతా కళకళలాడుతుంది.”
అతను చుట్టూ చూసాడు.
“ఇంతకీ ఈ రుద్ర గాడు ఎక్కడ చచ్చాడు? ఎవరు వీళ్లు?”
సాక్షి మాత్రం ఎంతో సాధారణంగా చెప్పింది—
“హలో తాతయ్యా...”
“మీ అబ్బాయి మా ఇంట్లో పని చేస్తూ ఉంటాడు.”
“ఈరోజు సాక్షాత్ పుట్టినరోజు అంట కదా. అందుకే మమ్మల్ని పిలిచాడు.”
రుద్ర తల్లి కాసేపు ఆశ్చర్యంగా చూసినా, ఏదో సర్దుకున్నట్టు నవ్వింది.
“అవునా... సరేలే అమ్మా. ఆడుకోండి.”
పిల్లలు పరుగెత్తుకుంటూ వెళ్లిపోయారు.
కానీ ఆ మాటలు అంజు చెవుల్లో మాత్రం గట్టిగా మిగిలిపోయాయి.
“ఇద్దరూ కవల పిల్లల్లా ఉన్నారు.”
అంజు వాళ్లిద్దరినీ చూస్తూనే ఉంది.
ఆమె మనసులో ఒక అనుమానం చీకట్లో చిన్న వెలుగులా మెరిసింది.
“వీళ్లిద్దరూ ఇంత ఒకేలా ఎందుకు ఉన్నారు?”
తర్వాత తానే తనను తాను సముదాయించుకుంది.
“ఒకే పోలిక ఉన్న వాళ్లు చాలామంది ఉంటారు. దీనిని అంతగా పట్టించుకోకూడదు.”
కానీ ఆమె మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు.
“ఈరోజు అక్షర ద్వారా అన్నీ తెలుసుకోవాలి.”
అని నిర్ణయించుకుంది.
---
అధ్యాయం — సాక్షి వ్యాధి
వంటగదిలో అంజు, అక్షర ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు.
కొద్దిసేపు మౌనం.
చివరికి అంజు ధైర్యం చేసి అడిగింది.
“అక్షర గారూ... నేను ఒకటి అడగనా?”
అక్షర నవ్వింది.
“అడగండి.”
“ఆ పాపకి...”
అంజు మాటలు కాసేపు ఆగాయి.
“సాక్షికి ఏమైంది?”
అక్షర ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
ఇప్పటివరకు కనిపించిన చలాకితనం నెమ్మదిగా మాయమైంది.
“అది చాలా పెద్ద కథ అండి.”
ఆమె గొంతు బరువెక్కింది.
“సాక్షికి చిన్నప్పటి నుంచే ఊపిరితిత్తుల సమస్య.”
అంజు శ్రద్ధగా వింటోంది.
“వాతావరణంలో పరిస్థితులు మారినా, గాలి వేగంగా తగిలినా... ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది.”
అక్షర కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది.
“అందుకే కొత్త ప్రదేశాలకు వచ్చినప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఆ మాస్క్ తప్పనిసరిగా ఉండాలి.”
“ఆ మిషన్‌తో కూడా ఆమెను రెగ్యులర్‌గా చెక్ చేయాలి.”
“ఎప్పుడు ఆక్సిజన్ లెవెల్ పడిపోతుందో ముందే గుర్తించాలి.”
“ఎక్కడైనా మళ్లీ ఊపిరి ఆడకపోతే... వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి.”
అంజు గొంతు ఎండిపోయింది.
“అంత ప్రమాదమా?”
అక్షర మెల్లగా తల ఊపింది.
“డాక్టర్లు కొన్ని రీడింగ్స్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఆ పరికరం ఉందిగా... అందులో వచ్చే రీడింగ్స్ మిస్ కాకూడదు.”
ఆమె బలవంతంగా చిరునవ్వు నవ్వింది.
“ఇంకొన్ని మందులు కూడా ఉన్నాయి. కొద్దిసేపట్లో వేయాలి.”
చివరగా చాలా సహజంగా అడిగింది—
“సాక్షికి పాలు ఉన్నాయా అండి?”
అంజు కళ్ళలో నీళ్లు తిరిగాయి.
“లేదండీ...”
ఆమె గొంతు వణికింది.
“నేను ఇప్పుడే తీసుకొస్తాను.”
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి.
అంజు మనసులో మరో ప్రశ్న తిరుగుతోంది.
దాన్ని అడగాలా వద్దా అని సందేహించింది.
చివరికి మెల్లగా అడిగింది.
“అవునూ... మరి మీకు భర్త లేరా?”
అక్షర చేతిలోని పని ఆగిపోయింది.
“లేక...”
అంజు మాట ఆగింది.
“యాక్సిడెంట్‌లో ఏమైనా...?”
ఆ ప్రశ్న పూర్తయ్యేలోపు అక్షర కళ్లలో నీళ్లు చేరాయి.
ఆమె వాటిని నెమ్మదిగా తుడుచుకుంది.
“అది ఏం చెప్పమంటారు...”
గొంతు బరువెక్కింది.
“ఆరు సంవత్సరాలకుపైగా అయిపోయింది.”
అంజు మౌనంగా వింటోంది.
“తను నా దగ్గర చాలా రోజులు ఉన్నాడు.”
అక్షర కాసేపు దూరంగా చూసింది.
“నేను ప్రాణంగా ప్రేమించాను.”
“వాడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నాను.”
ఆమె పెదవులు కొద్దిగా వణికాయి.
“కానీ...”
ఒక్కసారి కన్నీళ్లు తుడిచుకుంది.
“నాతో ఒకసారి ఇంటిమేట్ అయి... తన ఇంటికి వెళ్లిపోయాడు.”
అంజు గుండె ఒక్కసారిగా కొట్టుకుంది.
“అంతే.”
అక్షర కొనసాగించింది.
“మళ్లీ తిరిగి రాలేదు.”
ఆమె ముఖంలో ఎన్నో సంవత్సరాల నొప్పి.
“తర్వాత మా నాన్న నన్ను బాగా కొట్టాడు. అబార్షన్ చేయించుకోమన్నాడు.”
“కానీ...”
ఆమె కళ్ళు సాక్షి వైపు వెళ్లాయి.
“నాకు ఆ బిడ్డను చంపుకోవాలనిపించలేదు.”
“మా నాన్నతో గొడవపడి మరీ సాక్షికి జన్మనిచ్చాను.”
అంజు నిశ్శబ్దంగా నిలబడింది.
“తన నాన్న ఎప్పుడూ రాలేదు.”
“పాప ‘నాన్న ఎప్పుడు వస్తాడు? ఎక్కడున్నాడు?’ అని అడిగినప్పుడు...”
అక్షర గొంతు విరిగింది.
“ఏం చెప్పాలో అర్థం కాలేదు.”
ఆమె కన్నీటిని దాచుకుంటూ నవ్వే ప్రయత్నం చేసింది.
“చివరికి...”
“‘మీ నాన్న దొంగ నా కొడుకు. ఎక్కడో పడి చచ్చాడు. ఇక రాడు’ అని చెప్పేశాను.”
అంజు గుండె ఒక్కసారిగా బరువైంది.
అక్షర మెల్లగా చెప్పింది.
“పాపం... అప్పట్లో కొంచెం బాధపడింది.”
“తర్వాత మళ్లీ తన ప్రపంచంలో ఆడుకుంటూ తిరిగింది.”
కొన్ని క్షణాలు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.
అంజు మాత్రం ఇక అక్షర మాటల్ని వింటున్నది కాదు.
లెక్కలు వేస్తోంది.
ఆమె మెదడులో సంవత్సరాలు ఒక్కొక్కటిగా తిరిగాయి.
“అక్షర చెప్పింది... ఆరు సంవత్సరాలకుపైగా అయిపోయిందని.”
“నా దగ్గర నుంచి రుద్ర వెళ్లింది ఐదు సంవత్సరాల క్రితం.”
ఆమె గుండె ఒక్కసారిగా తేలికైంది.
“అంటే...”
ఆమె కళ్లలో ఒక్కసారిగా వెలుగు.
“అక్షరకు పాప పుట్టే సమయానికి రుద్ర నా దగ్గరే ఉన్నాడు!”
ఆమె ముఖంలో ఆనందం పెల్లుబికింది.
ఇన్నాళ్లు తన భర్తను వెంటాడిన అనుమానం ఒక్క క్షణంలో కూలిపోయింది.
“ఆ పాపకి తండ్రి రుద్ర కాదు!”
ఆమె మనసు ఉప్పొంగింది.
“నా భర్త తప్పు చేయలేదు!”
అంజు కళ్లలోకి వచ్చిన కన్నీళ్లు ఈసారి బాధవి కావు.
అవి ఉపశమనపు కన్నీళ్లు.
అక్షరను చూసిన ఆమెకు మొదటిసారి కోపం కాకుండా జాలి కలిగింది.
ఆమె కూడా తన జీవితంలో చాలా బాధపడిందని అర్థమైంది.
కానీ...
ఒక్క ప్రశ్న ఇంకా మిగిలింది.
పది లక్షలు.
అది మాత్రం ఆమెకు అర్థం కాలేదు.
అంజు నెమ్మదిగా రుద్ర పడుకున్న వైపు చూసింది.
అతను దూరంగా మంచం మీద ఏమీ తెలియనట్టుగా పడుకుని ఉన్నాడు.
ఆమె మళ్లీ అక్షర వైపు తిరిగింది.
చిరునవ్వు పెట్టింది.
“లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్... అక్షర గారూ.”
అక్షర కూడా చిన్నగా నవ్వింది.
అంజు మాత్రం ఈసారి చాలా సీరియస్‌గా అడిగింది—
“నాకు ఒక విషయం అర్థం కావడం లేదు.”
“మా ఆయన చెప్పిన దాని ప్రకారం... తను వంట మనిషి కదా?”
అక్షర మౌనంగా వింటోంది.
“కేవలం వంట చేసినందుకు...”
అంజు కాసేపు ఆగింది.
“మీరు ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు?”
ఆమె కళ్లలోని సందేహం పదునైంది.
“ముఖ్యంగా... ఆ పది లక్షలు ఎందుకు?”
అక్షర ముఖంలోని భావం ఒక్కసారిగా మారిపోయింది.
అంజు గమనించలేదు.
కానీ...
ఆ ప్రశ్నతో అక్షర కళ్లలో మెరిసిన ఒక చిన్న భయం—
కథలో దాగి ఉన్న మరో నిజానికి తలుపు తెరిచింది.