What is my fault? in Telugu Thriller by Lakshmi Prasanna books and stories PDF | నా తప్పు ఏంటి? - 4

Featured Books
Categories
Share

నా తప్పు ఏంటి? - 4

**4**

“ఏంటి మావా… పెళ్లిచూపులు అన్నావ్… అమ్మాయి నచ్చిందా?” అడిగాడు వికాస్ స్నేహితుడు అప్పుడే ఊరు నుంచి వచ్చిన వికాస్‌ని...

“రేయ్… కాస్త ఫ్రెష్ అయి రానివ్వరా… ఈలోపు వెళ్లి తినడానికి ఏమైనా తీసుకురారా… ఆకలి వేస్తుంది…” స్నానానికి వెళుతూ చెప్పాడు...

---

“కుంకుమ రంగు పట్టు పరికిణీ… గోధుమ రంగు వోణీ… చెవులకి జుంకాలు… మెడలో చిన్న నెక్లెస్… జడలో పువ్వులు… చిన్న నీటి భిందువు ఆకారం బొట్టు… చూడగానే అమ్మని చూసినట్టే అనిపించింది రా…” తింటూ తన స్నేహితులతో చెప్తున్నాడు వికాస్ ఫోన్లో వాళ్ల అమ్మ ఇరవై ఏళ్ల క్రితం దిగిన ఒక ఫోటో చూపిస్తూ…

“రేయ్… నిజంగా అమ్మలా ఉందా?” ఆసక్తిగా అడిగాడు ఆదిత్య...

“చూడు రా…” అంటూ ఫోటో చూపించాడు...

“రేయ్… ఒకసారి ఆలోచించు… ఇది 2024…. ఈ రోజుల్లో అంత పద్ధతిగా ఎవరు ఉన్నారు రా… పైగా బెంగళూరులో జాబ్ అంటున్నావ్… ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది… ఒకసారి ఆలోచించు…” అనుమానంగా హెచ్చరిస్తున్నట్టు చెప్పాడు భార్గవ...

“ఆపరా నువ్వు… వాడు చాలా రోజులకి ఒక అమ్మాయి నచ్చింది అంటుంటే పిచ్చి డౌట్లు రేపుతావ్...” కోపంగా అన్నాడు ఆదిత్య...

“రేయ్… అమ్మాయి నచ్చింది అని నేను ఎప్పుడు చెప్పాను రా?” కళ్ళు ఎగరేస్తూ అన్నాడు వికాస్ ఆదిత్య వైపు చూసి...

“ఇప్పుడే కదా అమ్మలా ఉంది… అలా ఉంది ఇలా ఉంది అన్నావ్…” ఆశ్చర్యంగా అడిగాడు...

“అమ్మలా ఉంది అన్నాను కానీ… నచ్చింది అనలేదు…” చెయ్యి కడుక్కుంటూ చెప్తున్నాడు...

“అంటే నచ్చలేదా…?” అనుమానంగా అడిగాడు...

“రేయ్… ఒక అమ్మాయి చూడటానికి ఎలా ఉందో చెప్పడానికి చూస్తే సరిపోతుంది కానీ… తనతో జీవితం అంతా బ్రతకగలమా లేదా చెప్పడానికి కాస్త మనసు తెలుసుకోవాలి రా…” తిన్న ప్లేట్ కడుగుతూ అంటున్నాడు...

“అబ్బా… మళ్ళీ స్టార్ట్ చేశావా… అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం కంటే న్యూక్లియర్ ఫిజిక్స్ ఈజీ రా బాబు… నువ్వు ఇలాంటి ఇంపాజిబుల్ విషయాలు మాట్లాడకు…” తల మీద చేయేసుకొని కాస్త నిరాశగా చెప్పాడు...

“అందరూ ఏమో కానీ… ఈ అమ్మాయి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది… అసలు మ్యాటర్ చెప్తా వినండి…”

“నిజానికి ఆ అమ్మాయికి పెళ్లి లాంటి రిలేషన్స్ మీద నమ్మకం లేదంట… ఎలాగైనా నో చెప్పాలి అని ఫిక్స్ అయి పెళ్లిచూపుల్లో కూర్చుంది… కానీ తన కళ్ళల్లో ఒక ధైర్యం చూశాను రా… అది చూశాక ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలి అనిపించింది… అందుకే ఇష్టం లేకపోయినా కాస్త తెలుసుకొని నో చెప్పండి అని ఆ అమ్మాయిని కాస్త కన్విన్స్ చేశా…” నిటారుగా వెన్ను విదిలించుకొని చెప్తున్నాడు చేతుల్లో మొహం దాచుకొని వింటున్న స్నేహితులకి.

“సరే మచ్చా… ఇప్పుడు ఏంటి…?” అడిగాడు భార్గవ...

“ఏం ఉంది… తనతో కొంచెం పరిచయం పెంచుకుంటా… తను ఏంటో తెలుసుకుంటా… ఒకరికి ఒకరు అర్థమైతే పెళ్లి చేసుకుంటా…” ఒక చిన్న కనీ కనిపించని సిగ్గుతో చెప్పాడు.

“హ్మ్మ్…. సరే కానీయ్…” డీప్ బ్రీత్ తీసుకొని అన్నారు ఇద్దరూ… వీడికి చెప్పలేమన్నట్టు...

---

ఓ బుధవారం ఉదయం, 11.00 అవుతుండగా… కోడింగ్‌లో పూర్తిగా లీనమై జుట్టు పీక్కోడమే బాకీ అన్నంత స్ట్రెస్‌లో పని చేస్తున్నప్పుడు మోగింది ఫోన్…

చిరాకుగా ఎవరో కూడా చూడకుండానే కట్ చేసేసింది శృతి...

కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ మోగుతుంది.

“హే! ఎవడ్రా నువ్వు… కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా… బిజీగా ఉన్నాను అని… ఇంకోసారి కాల్ చేస్తే చంపేస్తా…” ఫ్రస్ట్రేషన్‌లో అరిచింది శృతి.

“Is everything okay, శృతి…?” ఫోన్ పెట్టేసి ల్యాప్‌టాప్ వైపు తిరగబోతుండగా అడిగాడు అభి...

“యెస్…” ఏ భావం లేకుండానే చెప్పింది...

“ఒక బ్రేక్ తీసుకుందామా?” నీకు ఇప్పుడు బ్రేక్ అవసరం అన్నట్టు చూస్తూ అడిగాడు...

“హ్మ్…” కాస్త ఊపిరి పీల్చి… “పదా…” లేచి క్యాంటీన్ వైపు వెళ్లారు.

“నువ్వు రాస్తున్న కోడ్‌లో అంత కాంప్లికేటెడ్ ఏం కాదే… అయినా విసుగుకుంటున్నావంటే… ఏమైంది?” మర్యాదగా చెప్పేయ్ అన్నట్టు కాఫీ కప్ చేతికిస్తూ అడిగాడు...

“ఏం అవుతుంది అభి… కోడ్‌లో ఏదో ఎర్రర్ ఉంది… ఎంత ట్రై చేసినా క్లియర్ అవట్లేదు…” నిరాశగా చెప్పింది...

“ఏ ఎర్రర్ అయినా నువ్వు మనసు పెట్టి చూస్తే క్లియర్ అవుతుంది శృతి…” మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు.

“నేను నీకంటే 2 ఇయర్స్ పెద్దదాన్ని… అలా చూస్తే పాపం రా…” వెటకారంగా అంది.

“నేను ఏం నీకు సైట్ కొట్టట్లేదు మేడమ్… ఒక తమ్ముడిగా అడుగుతున్నా అనుకో… ఆల్ ఓకే?” ఆఖరి మాట చాలా ఆప్యాయంగా అన్నాడు...

‘నిజంగా తమ్ముడివి అయితే… నాకంటే అదృష్టవంతురాలు ఉండదు...’ మనసులో అనుకుంది...

“ఏంటి బాబు… ప్రతి ఎర్రర్ వెంటనే క్లియర్ అయిపోతుందా… కొన్నిటికి టైం పడుతుంది…”

“ఏంటి… మళ్ళీ ఏదైనా గొడవ అయిందా ఇంట్లో పెళ్లి గురించి?”

“ప్చ్… నీకెందుకురా అవన్నీ… పదా పనేం లేదా…” తిరిగి వెళ్తూ అనేసింది...

“సరే నాకు చెప్పక్కర్లేదు… కానీ ఎక్కువ స్ట్రెస్ అవ్వకు… అన్నీ సెట్ అవుతాయిలే…” ఫోన్ మాట్లాడుతున్నట్టుగా తనను దాటి వెళ్ళిపోయాడు.

‘నవ్వుకుంటూ డెస్క్ దగ్గరకు తిరిగెళ్లింది...’

---

‘Hello, this is Vikas.’ అని వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది రాత్రి అదే జీవిత లక్ష్యం లా ఫోన్ స్క్రోల్ చేస్తున్న టైంలో...

‘అబ్బా… వీడా… ఇప్పుడు ఎందుకు చేశాడు… అసలు ఏంటి వీడి గోల’ అనుకుంటుంది.

‘ఇప్పుడు రిప్లై ఇవ్వకపోతే ఏమనుకుంటాడో… ఆహ్! బొక్క లే… ఏదైనా అనుకోని… వాడేం నా బాయ్‌ఫ్రెండ్ ఆ ఫీల్ అవుతాడు అని ఆలోచించడానికి…’ 

‘ఇందాక మీ నాన్నగారు కాల్ చేశారు…’ అని మరో మెసేజ్ వచ్చింది.

‘ఏంటి… నాన్న ఎందుకు చేశారు… ఒకవేళ పెళ్లికి ఓకే చెప్పేశారా ఏంటి…’ భయంగా కాస్త కంగారు పడి రిప్లై ఇచ్చింది.

‘ఏం అన్నారు చేసి…’ అని.

‘కొంచెం ఇంపార్టెంట్… మీరు ఫ్రీ అయినప్పుడు కాల్ చేయండి చెప్తా.’

‘ఫ్రీగానే ఉన్నాలే అబ్బా… చెప్పు.’

ఫోన్ మోగుతుంది.

“హలో…” ఒక బెరుకుతో విసుగుతో కూడిన గొంతుతో అంది.

“హాయ్ శృతి… ఏం చేస్తున్నారు?” ప్రేమగా, చాలా ఎక్సైటింగ్‌గా అడిగాడు.

“ఏం లేదు కానీ… మా నాన్న కాల్ చేసి ఏం అన్నారు...?” కాస్త భయంగా అడిగింది.

‘పెళ్లి ఫిక్స్ చేశారు అని మాత్రం చెప్పకు రా ప్లీజ్.’

“ఓహ్! అదా… బెంగళూరులో చలి ఎక్కువ ఉందంటగా అని అడగడానికి చేశారు…” వెటకారంగా అన్నాడు.

“ఏంటి… వెటకారమా…?” కోపంగా అడిగింది.

“సారీ, సారీ… ఊరికే నీతో మాట్లాడటానికి అబద్ధం చెప్పా…”

“హ్మ్… నువ్వేమైనా నిబ్బా గాడివా ఇలా చేస్తున్నావ్?”

“సర్లే… ఏంటో చెప్పు.” మాట్లాడేస్తే ఒక గొడవ పోతుంది అన్నట్టు చెప్పింది.

“ఏంటి ఆఫీసులో… వర్క్ ప్రెజర్ ఆ… లేక బాస్ టెన్షనా… రోజంతా అలా విసుగ్గా ఉన్నావ్…”

“ఏం లేదు… అయినా నీకు ఎలా తెలుసు…?” అనుమానంగా అంది.

“అంతలా అరిచినప్పుడే గెస్ చేశా లే… నేను కార్పొరేట్ ఎంప్లాయినే… నాకూ తెలుసు ఆ మాత్రం.”

“ఓహ్! నువ్వేనా… మార్నింగ్ అన్ని సార్లు కాల్స్ చేసావ్?”

“యెస్… ఆ పాపాత్ముడిని నేనే...”

“ఎందుకు అన్ని సార్లు చేశావ్… ఆ మాత్రం సెన్స్ లేదా… ఎంప్లాయీవే గా… ఆఫీస్ అవర్స్‌లో డిస్టర్బ్ చేయకూడదు అని తెలియదా?”

“సారీ మేడమ్… ఇంకెప్పుడూ చేయను… అయినా అన్ని సార్లు, అన్ని సార్లు అని అన్ని సార్లు అంటావేంటి… నేను చేసింది రెండుసార్లే కదా.”

“రెండుసార్లు అయినా ఎందుకు చేయాలి… ఏంటి అంత షుగర్… తర్వాత మాట్లాడొచ్చు కదా…”

“సరే ఇప్పుడు మాట్లాడదామా?”

“ఏం మాట్లాడాలి… చెప్పు త్వరగా… నాకు నిద్రొస్తుంది…”

“అవునా… సరే పడుకోండి… వీకెండ్ మీరు ఫ్రీ అయితే కలిసి మాట్లాడుకుందాం లే.”

“ఓయ్! ఏంటి ఓవర్ చేస్తున్నావ్… వీకెండ్ ఏంటి, కలవడం ఏంటి… ఏదైనా ఇప్పుడే ఒక 5 మినిట్స్‌లో చెప్పు.”

“5 మినిట్స్‌లో లైఫ్ డెసిషన్స్ తీసుకునేంత ధైర్యం నాకు లేదు కానీ… చెప్పా కదా… కాస్త ఒకరినొకరు తెలుసుకుందాం అని… దానికే కాల్ చేశా…

మీకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు అంటే లైట్… మీ ఇంట్లో చెప్పేయండి… పర్లేదు.”

“హ్మ్… బై… గుడ్ నైట్…”

---

‘ఏంటి వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు..’

‘అయినా కొత్తగా ఉందే… ఎప్పుడూ పెళ్లి ఇష్టం లేదు అనగానే వెళ్లిపోయే వాళ్లే కానీ… ఇలా కారణాలు అడిగి విసిగించడం మొదటిసారి చూస్తున్నా.’

---

‘ఏంటి ఈ అమ్మాయి… నిజంగా ఇష్టం లేదా…?’ అనుకొని ఆలోచనలో మునిగిపోయాడు.

---

“ఎవరు శృతి కాల్… ఈ టైంలో…?” అడిగింది లాస్య.

“అదే ఆ పెళ్లి కొడుకు…” చిరాకుగా చెప్పింది.

“ఏయ్! అప్పుడే కాల్స్ వరకు వచ్చేశారా…?”

“ఆపవే… వాడిని ఎలా వదిలించుకోవాలా అని నేను చూస్తుంటే…”

“ఎందుకే వదిలించుకోవడం… అసలు వాడి కాల్ లిఫ్ట్ చేశావంటేనే… కాస్త వింతగా ఉంది… అంటే ఏదో మూలన వాడు నీకు నచ్చి ఉండాలి…”

“నీ బొంద… ఏదో విసిగిస్తుంటే లిఫ్ట్ చేశా… ఇంకేం లేదు.”

“శృతి… ఒకటి అడుగుతా చెప్పు…” పక్కకి తిరిగి తల కింద చేయి పెట్టి అంటుంది.

“ఏంటి…” కళ్ళు మాత్రం తన వైపు తిప్పి అంది.

“ఆ అబ్బాయి నచ్చలేదు అని మిగతా వాళ్ళ గురించి చెప్పినట్టు ఇంట్లో ఎందుకు చెప్పలేదు…?”

“చెప్పాగా… వాడు ఏదో లాజిక్లు లాగి లాక్ చేసాడు నన్ను…”

“వాడు లాజిక్ లాగాడే అనుకో… నువ్వు ఎందుకు ఆగాలి…?”

‘అవును కదా… నేను ఎందుకు ఆగాలి… ఇంట్లో చెప్పొచ్చుగా.’

“ఏంటి అలా మాట్లాడావ్?”

“ఏమోనే… నాకు నిద్రొస్తుంది… గుడ్ నైట్.”

“నువ్వు ఉన్నావే…”

---

“లాస్య… ఈరోజు మూవీకి వెళ్దామా…?” అడిగింది ఓ శనివారం పొద్దున్న టిఫిన్ చేస్తూ.

“హా వెళ్దామే… సమంత సినిమా రిలీజ్ అయిందిగా చూద్దాం… టికెట్స్ బుక్ చేస్తా…”

“ఫస్ట్ షోకి చెయ్.”

“హ్మ్…” అంటూ టికెట్స్ చూస్తుంది.

“లాస్య…”

“హా చెప్పు రా…”

….

“ఓయ్… ఏమైంది…?”

“ఆ అబ్బాయి నచ్చలేదు అని ఇంట్లో చెప్పేస్తా…”

“ఏయ్… నో… చెప్పకు… ప్లీజ్…”

“ఏం… నువ్వు రాత్రి అన్నది నిజమే… వాడు ఏదో కన్ఫ్యూజ్ చేస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోయా… మేబీ ఆ రోజు కాస్త టెన్షన్‌లో ఆలోచించలేదేమో… ఇప్పుడు క్లారిటీ వచ్చింది…”

“ఒసేయ్!... నీకు వచ్చింది క్లారిటీ కాదు ఏ… ఈగో…”

“ఏంటి…?”

“శృతి… నీకు లేనిది నమ్మకం కాదు… ఆశ… నీకు నచ్చిన వాళ్ళు నిన్ను వదిలి వెళ్లిపోయారు అని… వచ్చే వాళ్ళు అందరూ వెళ్లిపోతారు అనుకుంటున్నావ్… అది తప్పు రా…”

“వాడు వెళ్లిపోవడం నాకు మంచిదే అయింది లాస్య… వాడు వెళ్లిపోయాక… నిజమైన ప్రపంచాన్ని చూస్తున్నా…”

“వాడు ఏదో చేశాడు అని అందరూ అలానే చేస్తారా…?”

“అది నా ఒక్కదాని కథ కాదు లాస్య… చాలా మంది కథ… చూస్తున్నాగా రోజు చుట్టూ మగాళ్లని…”

“సరే… అందరినీ రోజు చూస్తున్నావ్ కదా… ఈ ఒక్కడిని కూడా చూడు.”

‘అయోమయంగా చూసింది.’

“ఒక్కసారి ఆలోచించు… ఒక్కసారి ఆబ్జర్వ్ చేసి చూడు… ఏమో నీకు 1% అయినా కనెక్ట్ అవ్వచ్చు ఏమో…”

…

“ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించు… వాళ్ళని ఎన్ని రోజులు ఇలా బాధ పెడతావ్…”

“ఒక్క 5 మినిట్స్ ఆలోచించు.”

“సరే… జస్ట్ చూస్తా… అది కూడా 1 వీక్ మాత్రమే.”

---